అంజనాపురం పాఠశాలకు అవార్డు
బూర్గంపాడు: మండలంలోని అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు ఎంపిక కావడంపై విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఏఎంఓ నాగరాజుశేఖర్, ఎంఈఓ యదుసింహరాజు ఫోన్ ద్వారా పాఠశాల హెచ్‌ఎం కిషన్‌ను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్వచ్ఛ ఎవమ్ హరిత్ విద్యాలయ’రేటింగ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, శౌచాలయాల నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ వంటి ఆరు ప్రధాన అంశాలపై రేటింగ్‌లు కేటాయించగా, అంజనాపురం ప్రాథమిక పాఠశాల ఉత్తమ ప్రతిభ కనబర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2వేల పాఠశాలలు పోటీపడగా, ఎంపికై న 20 పాఠశాలల్లో అంజనాపురం పాఠశాల ఉంది. జాతీయస్థాయి పురస్కారానికి కూడా పాఠశాలను ప్రతిపాదించామని, త్వరలో జాతీయస్థాయి బృందం పాఠశాల పరిశీలనకు రానుందని హెచ్‌ఎం కిషన్ తెలిపారు.


