కోడి పందేల స్థావరంపై దాడి
● 14 మంది అరెస్ట్, రూ.65వేల నగదు స్వాధీనం
సత్తుపల్లి: సత్తుపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధి ప్రకాష్‌నగర్ శివారు ఆయిల్‌పామ్ తోటలో కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. సత్తుపల్లి సీఐ టి.శ్రీహరి, ఎస్సై అశోక్‌కుమార్ సిబ్బందితో తనిఖీలు చేపట్టగా 14 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.65వేల నగదు, 11 కార్లు, కత్తులు, రెండు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. కల్లూరు సబ్ డివిజన్ పరిధిలో కోడి పందేలు, పేకాట, ఆన్‌లైన్ బెట్టింగ్, అక్రమ ఇసుక రవాణా వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వీటి సమాచారాన్ని స్థానికులు తమకు అందించాలని సూచించారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్య
తిరుమలాయపాలెం: మండలంలోని చంద్రుతండా పరిధి లకావత్‌తండాకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా శనివారం కేసు నమోదైంది. తండాకు చెందిన లకావత్ రవి(45) మద్యానికి బానిస కావడంతో పాటు కడుపునొప్పి రావడంతో శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య విజయ, ముగ్గురు పిల్లలు ఉండగా కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
రైల్వేస్టేషన్లలో విస్తృత తనిఖీలు
ఖమ్మంక్రైం: అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను రైళ్లలో తీసుకెళ్లకుండా కట్టడి చేసేందుకు స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం ఆర్‌పీఎఫ్ సీఐ సురేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యాన ఖమ్మంతో పాటు పలు స్టేషన్లలో శనివారం ఈ తనిఖీలు జరిగాయి. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే పెట్రోలు, డీజిల్ కిరోసిన్, గ్యాస్ సిలిండర్లు ఇతరత్రా తీసుకెళ్లవద్దని, ఎవరైనా ఇలాంటి వస్తువులతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
ఉద్యోగిని దూషించిన వ్యక్తిపై కేసు
ఖమ్మంరూరల్: ఇందిరమ్మ ఇళ్ల జియో ట్యాగింగ్ కోసం వచ్చిన గృహ నిర్మాణ శాఖ జౌట్‌సోర్సింగ్ ఏఈ బొమ్మకంటి లావణ్యతో అసభ్యంగా ప్రవర్తించిన ఏదులాపురానికి చెందిన సీహెచ్.భాస్కర్‌పై శుక్రవారం కేసు నమోదైంది. ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు... ఏఈ లావణ్య ఇళ్ల జియో ట్యాగింగ్‌లో భాగంగా గ్రామానికి వచ్చిన ఒకచోట కూర్చుని ఉంది. దీంతో భాస్కర్ వెళ్లి ఆమె దూషిస్తూ చేయి చేసుకున్నట్లు ఫిర్యాదు అందగా కేసు నమోదు చేశామని సీఐ ముష్క రాజు తెలిపారు. అయితే, ఒకచోట కూర్చుని కాకుండా ఇంటింటికీ వెళ్లి జియో ట్యాగింగ్ చేయాలని మాత్రమే తాను అన్నానని భాస్కర్ వెల్లడించాడు.


