వేసవికి ముందస్తు సన్నద్ధత | - | Sakshi
Sakshi News home page

వేసవికి ముందస్తు సన్నద్ధత

Feb 22 2026 7:09 AM | Updated on Feb 22 2026 7:09 AM

వేసవికి ముందస్తు సన్నద్ధత

వేసవికి ముందస్తు సన్నద్ధత

ముందుగానే పూర్తిచేసేలా...

నీటి సరఫరాలో సమస్యలపై

20రోజుల పాటు సర్వే

మరమ్మతులకు అంచనాలు, ఆపై పనులు

ఖమ్మంఅర్బన్‌: రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు గ్రామీణ నీటివనరుల శాఖ(ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పాటు జిల్లావ్యాప్తంగా తాగునీటి పథకాల పనితీరు, అంతరాయాలపై శాఖ ఇంజనీర్లు ఆవాసాల వారీగా పరిశీలన చేపట్టారు. ఈక్రమాన ఎదురైన సమస్యలతో నివేదిక రూపొందించి, మరమ్మతులకు కావాల్సిన నిధులతో అంచనాలు రూపొందించనున్నారు. వీటిని ప్రభుత్వానికి సమర్పించి నిధుల మంజూరు ఆధారంగా పనులు చేపడుతారు.

900 చేతిపంపులకు మరమ్మతులు

జిల్లాలో మొత్తం 915 నివాస ప్రాంతాలు(హ్యాబిటేషన్లు) ఉండగా, తిరుమలాయపాలెం మండలంలోని 17 మినహా మిగతా మండలాలన్నింటిలో సర్వే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈక్రమాన గుర్తించిన లోపాల ఆధారంగా అత్యవసర మరమ్మతుల అవసరమైనవి నమోదు చేశారు. జిల్లాలోని 7,825 చేతిపంపులకు 900 పంపులకు మరమ్మతులకు అవసరమని తేలింది. అలాగే, 259 సింగిల్‌ ఫేజ్‌ మోటర్లలో నాలుగు, 1,290 పీడబ్ల్యూ పథకాలలో 248 పథకాలకు మరమ్మతులు అవసరమని తేల్చారు. వీటి మరమ్మతులు త్వరగా చేస్తే వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఎక్కడ కూడా అంతరాయం రాదని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు నిధులపై ఒకటి, రెండు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు చెబుతున్నారు.

జిల్లాలో తాగునీటి పథకాల సర్వేను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ జి. శేఖరరెడ్డి పర్యవేక్షించారు. ఈఈలు పుష్పలత, వాణిశ్రీ ఎప్పటికప్పుడు మండలాల వారీగా డీఈలు, ఏఈలు తదితర ఇంజనీర్లకు సూచనలు చేయడంతో సర్వే సాఫీగా సాగింది. ఈమేరకు మరమ్మతులు అవసరమైన చోట సకాలంలో పూర్తి చేసి వేసవికి ముందే వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా తాగునీటి సరఫరాలో అంతరాయాలు ఉండవని, వేసవి తీవ్రత పెరిగి భూగర్భజలాలు అడుగంటినప్పుడు ఆ సమస్యపై దృష్టి సారించే అవకాశముంటుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement