కాంగి‘రేస్‌’లో నెగ్గింది.. | - | Sakshi
Sakshi News home page

కాంగి‘రేస్‌’లో నెగ్గింది..

Feb 14 2026 8:08 AM | Updated on Feb 14 2026 8:08 AM

కాంగి

కాంగి‘రేస్‌’లో నెగ్గింది..

కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్‌!

34 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు రెండింట గెలుపుతో బోణీ కొట్టిన బీజేపీ సీపీఐ 26, సీపీఎం నాలుగు స్థానాలు కై వసం 16 స్థానాలతో సత్తా చాటిన ఇండిపెండెంట్లు

ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చినా కొత్తగూడెంలో అనూహ్యంగా హంగ్‌ ఏర్పడింది. ఇక్కడ ఇండిపెండెంట్లు, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కార్పొరేటర్లు కీలకం కానున్నారు. ఇక్కడ 60 డివిజన్లకు గాను మేయర్‌ పదవి దక్కాలంటే 31 డివిజన్లు గెలుచుకోవాలి. కానీ మేజిక్‌ ఫిగర్‌ ఏ పార్టీకి దక్కకపోవడంతో సంకీర్ణంతో పాలకవర్గం ఏర్పడనుంది. కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌.. సీపీఎంతో జత కట్టింది. ఇక సీపీఐ, బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేశాయి. ఈమేరకు కాంగ్రెస్‌, సీపీఐకి సమానంగా 22 చొప్పున డివిజన్లు దక్కాయి. బీఆర్‌ఎస్‌కు ఎనిమిది, బీజేపీ, సీపీఎం ఒక్కో డివిజన్‌లో గెలవగా, ఆరు స్థానాలు ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ఎనిమిది డివిజన్లు దక్కించుకుని కింగ్‌మేకర్‌ అయింది. అయితే మేయర్‌ పదవిని దక్కించుకోవడానికి స్వతంత్రులు ఎవరికి సహకరిస్తారు, ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయో లెక్కల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయాన కూనంనేనికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ ఫోన్‌ చేయగా.. కాంగ్రెస్‌లోని పలువురు మంత్రులు ఆయనతో చర్చలు మొదలుపెట్టినట్లు తెలియగా పాలకవర్గం ఏర్పాటుపై శనివారం స్పష్టత రానుంది.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌ మినహా ఏడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ దూసుకెళ్లింది. డివిజన్లు, వార్డులు కలిసి మొత్తం 223 ఉండగా.. అందులో కాంగ్రెస్‌ 141 స్థానాలు దక్కించుకుంది. ఇక బీఆర్‌ఎస్‌కు 34, బీజేపీకి రెండు, సీపీఎంకు నాలుగు, సీపీఐకి 26, ఇండిపెండెంట్లకు 16 సీట్లు దక్కాయి. గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లాగే మున్సి‘పోల్స్‌’లో కూడా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌దే పై ‘చేయి’ అయింది.

చాలెంజ్‌గా తీసుకుని..

మున్సిపల్‌ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ చాలెంజ్‌గా తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాక పార్టీ సభకు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే విజయం కావాలని పిలుపునిచ్చారు. ఆపై రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురం, సత్తుపల్లి, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లోనే కాక కొత్తగూడెం కార్పొరేషన్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు, సత్తుపల్లిలో ఆ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధిర మున్సిపాలిటీతోపాటు వైరాలో ప్రచారం చేశారు. అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేల సమష్టి ప్రణాళికతో పార్టీకి భారీ విజయం చేకూరింది.

ముందుకు వెళ్లని ‘కారు’

ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ కలిసొచ్చే పార్టీలతో జతకట్టింది. అయినా ఆ పార్టీ ఎక్కడా చెప్పుకోదగిన పోటీ ఇవ్వలేకపోయింది. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను కేవలం రెండే దక్కగా, మధిరలో ఒక్క స్థానానికే పరిమితమైంది. అశ్వారావుపేటలో రెండు, ఇల్లెందులో మూడు వార్డులతో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. అయితే, సత్తుపల్లిలో ఆరు, కల్లూరు మున్సిపాలిటీలో ఈ పార్టీకి ఏడు వార్డులు దక్కాయి. మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి విస్తృతంగా ప్రచారం చేసినా కాంగ్రెస్‌ విజయపరంపరకు బీఆర్‌ఎస్‌ బ్రేకులు వేయలేకపోయింది.

అనుకున్న మేర సత్తా చాటక..

సీపీఎం, సీపీఐ పోటీ చేసిన స్థానాల్లో అనుకున్న మేరకు సత్తా చాటలేకపోయాయి. ఉమ్మడి జిల్లాలో సీపీఎంకు నాలుగు స్థానాలే దక్కాయి. కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌ ఎనిమిది డివిజన్లు గెలిచి కింగ్‌మేకర్‌ అయితే.. సీపీఐ 22 స్థానాల్లో గెలిచింది. ఇక అన్నిచోట్ల కలిపి 16 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటడం గమనార్హం. కొత్తగూడెంలో గెలిచిన ఆరుగురు ఇండిపెండెంట్లు మేయర్‌ పీఠం దక్కించుకోవాలనుకునే కాంగ్రెస్‌, సీపీఐకి కీలకమయ్యారు. ఇక ఉమ్మడి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం రెండింటినే దక్కించుకుది. అశ్వారావుపేటలో ఒక వార్డు, కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఒక డివిజన్‌లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు.

ఉమ్మడి జిల్లాలోని 141 స్థానాల్లో విజయం

కాంగి‘రేస్‌’లో నెగ్గింది..1
1/2

కాంగి‘రేస్‌’లో నెగ్గింది..

కాంగి‘రేస్‌’లో నెగ్గింది..2
2/2

కాంగి‘రేస్‌’లో నెగ్గింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement