నేనంటే.. నేనే!
కాంగ్రెస్‌లో చైర్మన్ ఆశావహుల పోటాపోటీ
తమకే పదవులు ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నపాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో విజేతల నుంచి చైర్మన్ పదవులకు పోటీ మొదలైంది. చైర్మన్ రిజర్వ్ అయిన కేటగిరీ వార్డుల్లో గెలిచిన అభ్యర్థులంతా తమకే పదవి ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నపాలు చేస్తున్నారు. అంతేకాక ముఖ్యనేతలతో పైరవీలు చేయించడంలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీ అధిష్టానమే సీల్డ్ కవర్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను పంపుతుందన్న ప్రచారం జరుగుతోంది.
● ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ పదవిని 23వ వార్డు నుంచి గెలిచిన పోకబత్తిని అనిత, 9వ వార్డు నుంచి గెలుపొందిన కందుకూరి శేషమ్మ, 17వ వార్డు నుంచి గెలిచిన గొడ్డుగొర్ల కృష్ణకుమారి ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవికి కూడా ఇదే స్థాయిలో ఆశావహులున్నారు. అయితే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయం మేరకే ఎంపిక ఉంటుందని ముఖ్య నేతలు చెబుతున్నారు.
● మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో 6వ వార్డు నుంచి గెలుపొందిన వేమిరెడ్డి లక్ష్మీతులసి ఆ పదవిని ఆశిస్తున్నారు. అలాగే వైస్ చైర్మన్ రేసులో 8వ వార్డు నుంచి గెలిచిన యన్నం కోటేశ్వరరావు, 12వ వార్డు విజేత మోదుగు నాగలక్ష్మి ఉన్నారు. ఇక్కడ పదవులు ఎవరికన్నది డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నిర్ణయంతోనే ఫైనల్ కానుంది.
● వైరా మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ పదవిని 3వ వార్డులో గెలిచిన బొర్రా ఉమాదేవి, 6వ వార్డులో గెలుపొందిన కాపా చంద్రకళ ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవికి 13వ వార్డు నుంచి గెలిచిన ముళ్లపాటి విజయలక్ష్మి, 6వ వార్డు గెలిచిన నుంచి పణితి సైదులు, 9వ వార్డు నుంచి గెలుపొందిన కట్ల సంతోష్ పోటీ పడుతున్నారు.
● సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ పదవి కోసం బొంతు సుమలత, తోట సుజలరాణి, ఎండీ.రెహనాబేగం, మట్టా దేవజ్యోతి పోటీ పడుతున్నారు. వైస్ చైర్మన్ పదవి రేసులో ఎండీ.రెహనాబేగం, దూదిపాల రాంబాబు, మండపాటి ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌కే.గ్రాండ్ మౌలాలీ ఉన్నారు.
● కల్లూరు మున్సిపాలిటీ ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కాగా ధరావత్ మోహన్‌నాయక్, బానోత్ మారోని, భూక్యా రాంబాయి ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవికి కూడా ముగ్గురు, నలుగురు పోటీలో ఉన్నారు.
● ఇల్లెందు మున్సిపల్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. చైర్మన్ పదవిని 5వ వార్డు విజేత చిల్లా విజయభారతి, 8వ వార్డు నుంచి గెలిచిన రేఖా స్వరూప ఉన్నారు. వైస్‌చైర్మన్ పదవిని 20వ వార్డు నుంచి గెలిచిన మహమ్మద్ జాఫర్ ఆశిస్తున్నారు.
● అశ్వారావుపేట మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. చైర్మన్ పదవిని 6వ వార్డు నుంచి గెలుపొందిన జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ పదవిని 13వ వార్డు నుంచి గెలుపొందిన జూపల్లి రమేష్‌బాబు ఆశిస్తున్నారు. వీరిద్దరూ భార్యాభర్తలు కావడం విశేషం.


