సెమీఫైనల్స్‌లోనూ మాదే విజయం
జీపీ ఎన్నికల్లో టికెట్ రాని వారు,
ఓడిన వారికి న్యాయం చేస్తాం
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సత్తుపల్లి: పదేళ్లు పరిపాలించి ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీ గ్రామపంచాయతీల్లో ఎన్నికల్లో పట్టుమని పది సర్పంచ్ స్థానాలను కూడా గెలుచుకోలేకపోయిందని రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. అయినా సెమీఫైనల్స్‌గా నిలిచే మున్సిపల్ ఎన్నికల్లో ఏదో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నా ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల సన్మాన సభ మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 69శాతం సర్పంచ్ పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కాయని.. కొన్ని చోట్ల అధికార పార్టీలో పోటీతోనే పంచాయతీలు కోల్పోయామని పేర్కొన్నారు. అయితే, ఓడిన సర్పంచ్ అభ్యర్థులు, టికెట్లు రాని వారు నిరుత్సాహపడాల్సిన పని లేదని భరోసా కల్పించారు. ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని తెలిపారు. ఇదేసమయాన గెలిచిన సర్పంచ్‌లు పొరపాట్లకు తావివ్వకుండా మంచిగా పని చేయాలని, సమస్యలు ఎదురైతే ఎమ్మెల్యేతో పాటు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు చేజిక్కించుకుంటామని మంత్రి వెల్లడించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ జీపీ ఎన్నికల్లో విజయం స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులతోనే నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిచామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తాం తప్ప సిఫార్సులు ఉండవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దోమ ఆనంద్‌బాబు, భాగం నీరజాదేవి, ఎండీ.కమాల్‌పాషా, చల్లగుళ్ల నర్సింహారావు, గాదె చెన్నారావు, ఎస్‌కే. మౌలాలీ, నారాయణవరపు శ్రీనివాస్, పింగళి సామేలు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, తోట సుజలారాణి, శివవేణు, చందు పాల్గొన్నారు.


