చెత్త డంపింగ్‌కు స్థలం ఏదీ?
● నానాటికీ తీవ్రమవుతున్న యార్డ్ సమస్య ● రోడ్డు సౌకర్యం లేక దారిలోనే వ్యర్థాల డంప్ ● దారిలేదని వాహనాలు నిలిపివేసిన డ్రైవర్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం దానవాయిగూడెంలోని డంపింగ్ యార్డు సమస్య జటిలమవుతోంది. కేఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు చెత్తను రీసైక్లింగ్ చేయించడం, కంపోస్ట్ ఎరువులు తయారు చేస్తన్నట్లు చెబుతున్నా అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదు. దీనికి తోడు రోజువారీ సేకరిస్తున్న వ్యర్థాలు 200 టన్నులకు పైగా ఉండడంతో డంపింగ్ యార్డ్‌లో వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయి వాహనాలు వచ్చివెళ్లడం ఇబ్బందిగా మారుతోంది.
తగ్గిపోతున్న ఖాళీ స్థలం
ఖమ్మం విస్తరిస్తున్న కొద్దీ చెత్త సేకరణ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా డంపింగ్ యార్డు సామర్థ్యం పెరగడం లేదు. రోజువారీ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే వేగం కంటే, వస్తున్న చెత్త ఎక్కువగా ఉండడంతో యార్డులో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వ్యర్థాల నిర్వహణలో శాసీ్త్రయ పద్ధతులు అవలంబించక.. వర్గీకరణ సరిగా జరగక ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
మూసుకుపోతున్న దారి
డంపింగ్ యార్డుకు వెళ్లేందుకు కనీస రోడ్డు లేకపోవడం డ్రైవర్లను ఇబ్బందికి గురిచేస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో బురదమయంగా మారి తరచూ వాహనాలు కూరుకుపోతున్నాయి. వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ వంటి కార్పొరేషన్లలోని డంపింగ్ యార్డ్‌ల చుట్టు వాహనాలు తిరిగేలా రోడ్లు నిర్మించి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. కానీ ఖమ్మంలో యార్డ్‌లో రహదారి సరిగ్గా లేకపోవడంతో సమస్యగా మారింది. అంతేకాక యార్డ్ లోపలకు వెళ్లే దారిలో కాల్వపై కల్వర్టు కూలిపోవడంతో వాహనాలను లోపలకు తీసుకెళ్లకుండా దారిలోనే వ్యర్థాలను డంప్ చేస్తున్నారు. అయితే, యార్డ్‌లో వ్యర్థాలను ఎప్పటికప్పుడు కుప్పగా వేయిస్తూ వాహనాలు వెళ్లేలా అధికారులు పర్యవేక్షించాలి. ఇందుకోసం పొక్లెయినర్లను వినియోగించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. పారిశుద్ధ్య పర్యవేక్షణకు అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి ఉన్నా పట్టింపు లేని తనంతో తరచూ సమస్య ఉత్పన్నమవుతోందని తెలుస్తుంది.
వాహనాలు నిలిపివేత..
రెండు రోజులుగా డంపింగ్‌యార్డ్‌లోకి చెత్త వాహనాలను తీసుకెళ్లడంలో ఇబ్బంది ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం డ్రైవర్లు నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం పార్కింగ్ పాయింట్ నుండి వాహనాలు తీయకపోవడంతో అధికారులు ఆరా తీయగా విషయం బయటపడింది. ఆపై మేయర్ ఆదేశాలతో అసిస్టెంట్ కమిషనర్, శానిటరీ సూపర్‌వైజర్ డ్రైవర్లతో సమావేశమై వాహనాలను తీసుకెళ్లాలని సూచించినా సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో అప్పటికప్పుడు యార్డ్‌లో బయోమైనింగ్ నిర్వాహకుల వద్ద ఉన్న పొక్లెయినర్‌తో వ్యర్థాలను తొలగించే పని చేపట్టారు.
పనుల్లో జాప్యం
డంపింగ్‌యార్డ్‌లో వ్యర్థాలను తొలగించేందుకు పొక్లెయినర్ ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు. గత నెల 30వ తేదీనే టెండర్ ఖరారు చేసి కాంట్రాక్టర్‌కు పని కేటాయించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికై నా టెండర్ ఖరారు చేసి పొక్లెయినర్‌ను కేఆయించాలని, తద్వారా పేరుకుపోయిన చెత్త గుట్టలను పక్కకు తప్పిస్తే వాహనాలు తీసుకెళ్లడం సులభమవుతుందని డ్రైవర్లు చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం దారిలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్నామని, సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
చెత్త డంపింగ్‌కు స్థలం ఏదీ?
చెత్త డంపింగ్‌కు స్థలం ఏదీ?


