కట్లేరు నుంచి కళ్లు గప్పి...
● ‘ఇందిరమ్మ’ పేరుతో ఇసుక దందా ● గ్రామస్తుల ఆందోళనతో తవ్వకాలకు బ్రేక్
ఎర్రుపాలెం: మండలంలోని మీనవోలు కట్లేరులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ అక్రమార్కులకు అడ్డాగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల కూపన్ల పేరుతో కొందరు అధికార పార్టీ నాయకులు.. ఉద్యోగుల అండతో అక్రమాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. కట్లేరులో వరద ప్రవాహం కొంతే ఉన్నప్పటికీ పెద్ద జేసీబీతో ఇసుక తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ప్రతీరోజు 120 ట్రాక్టర్లకు పైగా లోడింగ్ చేస్తూ సరిహద్దు మండలానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. చివరకు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తవ్వకాలు నిలిపివేయగా ఎన్నాళ్లు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందో తెలియడం లేదు.
ఇక్కడే అక్రమాలు
కట్లేరు పరీవాహక ప్రాంతంలో రాజులదేవరపాడు, చొప్పకట్లపాలెం, బనిగండ్లపాడు, మీనవోలు, తక్కెళ్లపాడు, సఖినవీడు గ్రామాల్లో ఇసుక రీచ్‌లను ప్రభుత్వం గుర్తించింది. అయితే, చొప్పకట్లపాలెం, రాజులదేవరపాడు రీచ్‌ల్లోకి వెళ్లేందుకు సరైన దారి లేకపోగా.. తక్కెళ్లపాడులో ఆ గ్రామస్తులకే ఇసుక తరలించేలా తీర్మానం చేసుకున్నారు. వేరే గ్రామాల నుంచి ప్రభుత్వం ఇచ్చిన కూపన్లతో వచ్చినా ఇసుక తోలకానికి అనుమతి ఇవ్వడం లేదు. మిగతా చోట్ల ఇసుక తవ్వకానికి వీలున్నా ఎక్కువగా మీనవోలు రీచ్‌పైనే దృష్టి సారించారు. ఇదేఅదునుగా కొందరు అధికార పార్టీ నాయకులు రాత్రీపగలు తేడా లేకుండా ఉద్యోగుల అండదండలతో కూపన్లతో నిమిత్తం లేకుండా మధిర మండలం సాయిపురం, తొర్లపాడు, తొండలగోపవరం మీదుగా మధిర మండలానికి ఇసుక తరలిస్తున్నారు. ఇదిపోగా మీనవోలు ట్రాక్టర్ల యజమానులు సీరియల్ కాకుండా నేరుగా లోడ్ తీసుకుని అక్కడికక్కడే రూ.వేయి చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. మండలంలో పలుచోట్ల రీచ్‌లను గుర్తించినా మీనవోలు నుంచే భారీ సంఖ్యలో వాహనాల ద్వారా ఇసుక తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మిగతా ఇసుక రీచ్‌లకు వెళ్లేలా మార్గాలు ఏర్పాటుచేస్తే ఇక్కడ భారంతో పాటు అక్రమాలూ తగ్గే అవకాశం ఉన్నా సాకులతో కాలం గడుపుతుండడం విమర్శలకు తావిస్తోంది.
గ్రామస్తుల ఆగ్రహం
మీనవోలు ఇసుక రీచ్ నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు, తరలింపు జరుగుతుండడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాగే కొనసాగితే స్థానికుల అవసరాలకు ఇబ్బంది అవుతుందని మంగళవారం తవ్వకాలను అడ్డుకున్నారు. ఆపై తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వగా ఇసుక తోలకాలను నిలిపివేయించి పంచాయతీ కార్యదర్శి శివుడుకు మెమో ఇచ్చారు. ఈ విషయమై తహసీల్దార్ ఉషాశారద వివరణ కోరగా.. ఇసుక తరలింపునకు మీనవోలు రీచ్ అనుకూలంగా ఉండడంతో అందరూ ఇక్కడకు వస్తున్నారని తెలిపారు. అయితే, జేసీబీతో ఇసుక తవ్వ డం, కూపన్లతో సంబంధం లేకుండా ఇసుక ఇస్తున్నట్లు తెలియలేదని చెప్పారు. ప్రస్తుతం తోలకాలు నిలిపివేసి పూర్తిగా పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.
కట్లేరు నుంచి కళ్లు గప్పి...


