ప్రతీక్షణం అప్రమత్తతే ప్రధానం
అన్ని డిపోల్లో గేట్ మీటింగ్‌లు
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యాన టీజీఎస్ ఆర్టీసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. డ్రైవర్లు ఏ చిన్న తప్పిదం చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎదురుగా వచ్చే వాహనాల విషయంలో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఖమ్మం రీజియన్ మేనేజర్ ఆదేశాలతో డిపో గేట్ మీటింగ్‌ల ద్వారా డ్రైవర్లకు సూచనలు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని చెబుతూ డిపో మేనేజర్లు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్లు(ఎస్‌డీఐ), ఇతర అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక డ్రైవర్లు తమ వెంట ఫోన్లు తీసుకెళ్లకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. వీటికి తోడు అన్ని డిపోల్లో డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు కూడా చేస్తున్నారు.
ప్రత్యేక శిక్షణ
ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల డ్రైవర్లకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రతీనెల కొనసాగుతున్న ఈ శిక్షణలో ప్రయాణికులను భద్రంగా గమ్య స్థానాలకు చేర్చడంలో డ్రైవర్ల పాత్రను వివరిస్తున్నారు. బస్సుల ఫిట్‌నెస్‌ను సరిచూసుకోవడం, పాటించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లను గుర్తించి శిక్షణ ఇప్పిస్తున్నారు.
ఆర్‌టీసీ డ్రైవర్లకు సూచనలు చేస్తున్న అధికారులు
ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చేలా డ్రైవర్లను అప్రమత్తం చేయాలని డిపో అధికారులను ఆదేశించాం. ప్రతీ డిపోలో గేట్ మీటింగ్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తూ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నాం. డ్రైవర్లు మరింత జాగ్రత్తగా, నైపుణ్యంతో బస్సు నడపాలని సూచిస్తున్నాం.
– ఏ.సరిరామ్, ఖమ్మం రీజియన్ మేనేజర్


