దాచుకున్న డబ్బు బలవంతంగా ఎత్తుకెళ్లారు..
కొణిజర్ల: వృద్ధాప్యంలో తమకు అండగా నిలిచే వారికి ఇచ్చేలా దాచుకున్న నగదును మనవళ్లు లాక్కెళ్లారని వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని గద్దలగూడెంనకు చెందిన దేవళ్ల వెంకయ్య – గురువమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ వివాహాలు జరగగా, ముగ్గురు కొడుకులకు నాలుగెకరాల చొప్పున పొలం పంచి ఇచ్చారు. ఆపై అవసరాలకు రెండెకరాలు ఉంచుకోగా, ఇటీవల ఇద్దరూ అనారోగ్యం పాలవడంతో చికిత్స నిమిత్తం ఎకరంన్నర పొలం అమ్మగా వచ్చిన రూ.4.50 లక్షలు ఇంట్లో భద్రపరిచారు. ఈ నెల 2న వెంకయ్య పెద్ద కొడుకు రాములు కొడుకులైన నవీన్, శ్రీకాంత్ ఇంట్లోకి జొరబడి తమను కొట్టి డబ్బు ఎత్తుకెళ్లారని వాపోయారు. దీన్ని అడ్డుకున్న గురవమ్మను నెట్టివేయడంతో కాలు విరిగిందని తెలిపారు. కాగా, చాలాకాలం కిందటే రాములు మృతి చెందాడని వృద్ధులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్ తెలిపారు.
మనవళ్లపై పోలీసులకు
వృద్ధ దంపతుల ఫిర్యాదు


