మున్సి‘పోల్స్’లో కీలక అడుగు
● కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు ● 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు వార్డులు ● డెడికేషన్ కమిటీ సిఫారసులతో బీసీలకు కేటాయింపు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతుండగా.. అధికారులు ఒక్కో ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితా ప్రకటించారు. ఇటీవల పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా కూడా విడుదలైంది. ఇంతలోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి మున్సిపల్ శాఖ కార్యదర్శి టీ.కే.శ్రీదేవి పేరిట జాబితా విడుదలైంది.
అటు జనాభా.. ఇటు కమిషన్
వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీల విషయాన వేర్వేరు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రకటించారు. బీసీల విషయానికొచ్చేసరికి డెడికేషన్ కమిటీ సిఫారసులను ఆధారంగా తీసుకున్నారు. కాగా, కేటగిరీల వారీగా మొత్తం రిజర్వేషన్లను ప్రకటించగా, ఏయే డివిజన్ / వార్డు ఎవరికి అనేది జిల్లా అధికారులు ఖరారు చేయనున్నారు.
జాబితాలో ఖమ్మం కూడా
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియడానికి ఇంకా సమయం ఉంది. అయితే, అన్ని మున్సిపాలిటీలతో పాటే ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకోసం పాలకవర్గాన్ని రద్దుచేయాలని మెజార్టీ సభ్యులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం ఎటూ తేలకముందే తాజా రిజర్వేషన్ల జాబితాలో ఖమ్మం కార్పొరేషన్‌కు కూడా చోటు కల్పించడం విశేషం. ఇక కోర్టు కేసుల కారణంగా మణుగూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం లేనందున జాబితాలో చోటు దక్కలేదు.


