పండుగ వేళ విషాదం..
● విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ● ఘటనలో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
ఖమ్మంఅర్బన్: కారు డ్రైవర్లు, రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న నలుగురు మిత్రులు పండుగ వేళ కలుసుకున్నారు. మూడు రోజులు సంతోషంగా గడుపుదామని భావిస్తుండగానే ప్రమాదం వారిని వెంటాడింది. వీరు వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. ఇంకో ఇద్దరు తీవ్రగాయాల పాలైన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఖమ్మం వైఎస్సార్ కాలనీకి చెందిన నలుగురు యువకులు చిన్నతనం నుంచే స్నేహితులు కాగా డ్రైవర్లుగా, ఇతర పనుల్లో స్థిరపడ్డారు. అంతా కలిసి బుధవారం కారులో రఘునాథపాలెం వైపు వెళ్లి వస్తున్నారు. ఈక్రమాన బైపాస్‌లో నూతన మెడికల్ కాలేజీ నిర్మాణ ప్రాంతం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు వెంట విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారు వేగం తాకిడికి స్తంభం విరిగిపోగా, వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో కారు నడుపుతున్న దోమల మధు(23) అక్కడికక్కడే మృతి చెందగా కోట మధును ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. అలాగే, జి.శ్రావణ్, బానోతు రాములుకు తీవ్రగాయాలు కాగా శ్రావణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. కోట మధు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా ఆయన తండ్రి గురుస్వామి మూడు నెలల క్రితమే బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. మృతులిద్దరూ అవివాహితులు కావడం, చేతికొచ్చి న కుమారుల మృతితో వారి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న సీఐ ఉస్మాన్ షరీఫ్ ఆధ్వర్యాన పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పండుగ వేళ విషాదం..


