రైలొచ్చినా రోడ్డుమార్గమే.. | Sakshi
Sakshi News home page

రైలొచ్చినా రోడ్డుమార్గమే..

Published Sat, May 18 2024 2:25 AM

రైలొచ

● 2022లో అందుబాటులోకి బొగ్గు రైలు ● అయినా సత్తుపల్లి నుంచి ఆర్‌సీహెచ్‌పీకి లారీల్లో రవాణా ● పర్యావరణ అభ్యంతరాలను పక్కనపెట్టడంపై విమర్శలు ● మరోపక్క లోడింగ్‌ లేక లారీ యజమానుల నిరసన

సత్తుపల్లి: సత్తుపల్లి ఓపెన్‌కాస్టుల్లో తవ్వకాలు ప్రారంభమైనప్పుడే బొగ్గు తరలింపునకు రైలు మార్గానికి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని పర్యావరణశాఖ నిబంధన విధించింది. అయినప్పటికీ 2005లో బొగ్గు తవ్వకాలు ప్రారంభం కాగా 17ఏళ్ల పాటు కొత్తగూడెంకు టిప్పర్ల ద్వారానే రవాణా చేశారు. పర్యావరణ శాఖ పలుమార్లు తాఖీదులు ఇవ్వడంతో ఒత్తిడి తీసుకురావడంతో రైల్వేలైన్‌ పూర్తి చేసి 2022 జూన్‌లో బొగ్గు రవాణాను ప్రారంభించారు. దీంతో కొత్తగూడెంకు టిప్పర్లతో బొగ్గు రవాణాకు బ్రేక్‌ పడింది. అయితే ఇటీవల పర్యావరణ శాఖ అభ్యంతరాలను పక్కనబెట్టి మళ్లీ కొత్తగూడెం ఆర్‌సీహెచ్‌పీకి టిప్పర్ల ద్వారా 9 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రైల్వేలైన్‌ మొదలయ్యాక కొత్తగూడెంకు రోడ్డుమార్గంలో రవాణా చేయబోమని చెప్పిన అధికారులు మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకోవడంపై లారీల యజమానులు తప్పుపడుతున్నారు.

కాకినాడ లోడింగ్‌ ఆగడంతో..

సత్తుపల్లి లారీ యూనియన్‌ కార్యాలయం ద్వారా 750 లారీలను బొగ్గు రవాణాకు వినియోగిస్తున్నారు. ఈ లారీల మీద ప్రత్యక్షంగా 3వేల మంది, పరోక్షంగా 8వేల మంది జీవనం సాగిస్తున్నారు. అయితే, ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలు కావడంతో గతేడాది జనవరి నుంచి కాకినాడ పోర్టుకు బొగ్గు రవాణా నిలిచిపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. కాకినాడకు బొగ్గు రవాణా ఉంటే రోజుకు 100 నుంచి 150 లారీలకు లోడింగ్‌ దక్కేది. కాగా ఫిట్‌ హెడ్‌ డెలివరీ(పీహెచ్‌డీ) కింద సత్తుపల్లి, కిష్టారం ఓసీల నుంచి రోజుకు 7వేల నుంచి 8వేల టన్నుల బొగ్గు రవాణా ఉంటేనే సత్తుపల్లిలోని లారీల యజమానులు, డ్రైవర్లకు ఉపాధి లభిస్తుంది. కానీ సత్తుపల్లి ఓసీల్లో నాణ్యమైన జీ–8, జీ–13 బొగ్గు ఉందని చెబుతున్నా... పరిశ్రమల నుంచి సరిపడా ఆర్డర్లు రాకపోవటంతో లోడింగ్‌ వ్వలేకపోతున్నామని అదికారులు చెబుతున్నారు. నాణ్యమైన బొగ్గు ఇవ్వకపోవడంతోనే పరిశ్రమలు ముందుకు రావడం లేదని యజమానులు వాదిస్తుండగా.. ఆర్థిక సంవత్సరం ఆరంభ సమయం కావడమే కారణమని అధికారులు చెబుతున్నారు.

కొనసాగుతున్న నిరసనలు

బొగ్గు లోడింగ్‌ పెంచాలని, కొత్తగూడెం ఆర్‌సీహెచ్‌పీకి రవాణా నిలిపివేయాలనే డిమాండ్‌తో సత్తుపల్లి లారీ యూనియన్‌ ఆధ్వర్యాన చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వంటావార్పు ద్వారా నిరసన తెలపగా, శనివారం నుంచి అఖిలపక్షంతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టనున్నటువెల్లడించారు. అలాగే, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. లారీ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కొండపల్లి రమేష్‌రెడ్డి, కీజర్‌తో పాటు పీఎల్‌.ప్రసాద్‌, ఎస్‌.కే.మౌలాలీ, కోటిరెడ్డి, చిన్నంశెట్టి సూరిబాబు, దురిశేటి శ్రీనివాసరావు, వెలిశాల చెన్నాచారి, ఐ.శ్రీను, కోటా మోహన్‌రావు, వేముల విశ్వనాథం, ఎస్‌.కే.మస్తాన్‌, ఎస్‌.కే.లియాఖత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓవర్‌ లోడ్‌.. ప్రమాదాలు

సత్తుపల్లి జేవీఆర్‌ ఓసీ, కిష్టారం ఓసీ నుంచి కొత్తగూడెం ఆర్‌సీహెచ్‌పీ వరకు రోజుకు వంద టిప్పర్లతో బొగ్గు రవాణా చేసిన సమయాన ప్రమాదాలు నిత్యకృత్యం కాగా.. మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకోవడంతో ఎప్పుడేం జరుగుతోందనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక్కో టిప్పర్‌ రోజుకు ఐదారు టిప్పులు వేయాల్సి రావడంతో డ్రైవర్లు అతివేగంగా నడుపుతారని గత అనుభవాలు చెబుతున్నాయి. 2005 నుంచి 2022 వరకు 200మందికిపైగా మృత్యువాత పడగా సుమారు 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారంటే పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు కనీసం 25వేల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉండగా, కిలోమీటర్‌కు టన్నుకు రూ.3.29పైసలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. కానీ 14టైర్ల టిప్పర్‌లో 24 టన్నులకు బదులు అదనంగా ఐదారు టన్నులు లోడింగ్‌ చేస్తుండడం.. మితిమీరిన వేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాక డ్రైవర్లు విశ్రాంతి లేకుండా విధులు నిర్వర్తిస్తుండడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని అప్పట్లో గుర్తించి కొత్తగూడెంకు టిప్పర్ల ద్వారా బొగ్గు రవాణాను నిషేధించారు.

రైలొచ్చినా రోడ్డుమార్గమే..
1/1

రైలొచ్చినా రోడ్డుమార్గమే..

Advertisement
 
Advertisement
 
Advertisement