ఖమ్మం లీగల్: అత్యధిక కేసులను పరిష్కరించడంతో పాటు తక్షణ న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవల అథారిటీ జిల్లా చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. కోర్టు ఆవరణలో బుధవారం న్యాయమూర్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమూర్తులు ఉమాదేవి, అర్చనకుమారి, రాంప్రసాదరావు, సీనయ్య, కల్పన, మురళీమోహన్, దీప, రజని, బిందుప్రియ, నాగలక్ష్మి, అఖిల తదితరులు పాల్గొన్నారు.
●ఖమ్మంగాంధీచౌక్: జిల్లా వైదిక బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యాన రూపొందించిన పంచాంగాన్ని జిల్లా జడ్జి రాజగోపాల్ ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాటికొండల సీతారామశాస్త్రి, కొండూరి సరస్వతికుమార్‌తో పాటు కొనకంచి ప్రసాద్, నూతక్కి వెంకటేశ్వరరావు, మూల వెంకన్న, అవధానుల రామకృష్ణశర్మ, వడ్లమాని లక్ష్మీనారాయణ, ఆమంచి సురేష్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేయండి
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొబ్బరి తోటలు ఉన్నందున కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. పార్లమెంట్‌లో బుధవారం మాట్లాడిన ఆయన అశ్వారావుపేట లేదా దమ్మపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రైతులకు సాంకేతిక సాయం, నాణ్యమైన సాగు, మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ప్రశాంతంగా ఎస్సెస్సీ పరీక్ష
ఖమ్మం సహకారనగర్: పదో తరగతి రెండో పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగిందని డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. ఈమేరకు హిందీ పరీక్షకు 16,990మందిలో 16,972మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా స్థాయి అబ్జర్వర్లు, అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు తాను పలు కేంద్రాల్లో తనిఖీ చేశామని తెలిపారు.
అడవి పందిని వే టాడిన ముగ్గురి అరెస్ట్
ఖమ్మంవ్యవసాయం: పెనుబల్లి మండలం తాళ్లపెంట పెద్దచెరువు గుట్టపై అడవి పందిని వేటాడిన ముఠాను అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. తాళ్లపెంటకు చెందిన ఐదుగురు మంగళవారం అడవి పందిని హతమార్చి మాంసాన్ని బుధవారం విక్రయిస్తుండగా గడ్డి మారేష్, మడిపల్లి రాంబాబు, కొత్తపల్లి బాలయ్యను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన బద్దం నర్సింహారావు, పీట్ల రామకృష్ణ పరారీలో ఉన్నారని తల్లాడ రేంజ్ అధికారి జి.ఉమ తెలిపారు.
ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య
ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలోని తెల్దారుపల్లికి చెందిన ఉన్నం భవాని(26) ఆత్మహత్యకు పాల్పడింది. పీజీ పూర్తిచేసిన ఆమెకు ఉద్యోగం రాకపోవడంతో గడ్డి మందు తాగగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె తల్లి రమణకుమారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్కరాజ్ తెలిపారు.


