కొత్తగూడెంటౌన్: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ భద్రాద్రి జిల్లా జడ్జి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఖమ్మంకు చెందిన బాలిక కాళ్లకు పక్షవాతం రాగా నాటువైద్యం చేయించేందుకు తల్లిదండ్రులు అశ్వా పురం మండలం మంచికంటి నగర్‌లోని అమ్మమ్మ ఇంట్లో వదిలివెళ్లారు. వీరి ఇంటి సమీపాన ఉండే జవ్వాజి సాంబశివరావు తన ఇంట్లో టీవీ చూపిస్తానని 2021 డిసెంబర్ 30న ఒంటరిగా ఉన్న బాలికను ఎత్తుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడి ఆమె కేకలు వేయగా పరారయ్యాడు. దీంతో కేసు దర్యాప్తు చేపట్టి పోలీసులు కోర్టు లో చార్జీషీటు దాఖలు చేయగా విచారణలో సాంబశివరావుపై నేరం రుజువైనందున 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. అలాగే, బాధితురాలికి పునరావాస పరిహారం కింద రూ.ఐదు లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరఫున వి.నాగిరెడ్డి వాదించారు.