హొసపేటె: విజయనగర జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. హొసపేటె నగర శివార్లలోని జంబునాథహళ్లి ప్రాంతంలో రూ.104 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన 250 పడకల నూతన జిల్లా ఆస్పత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జిల్లా ఇంచార్జి మంత్రి కేఎస్.బసవంతప్ప శనివారం ఆధునిక ఆస్పత్రిని ప్రారంభించి జిల్లా ప్రజలకు అంకితం చేశారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కొత్త జిల్లా ఆస్పత్రి ప్రారంభంతో విజయనగర జిల్లాలో వైద్యరంగానికి కొత్త ఊపిరి లభించినట్లయింది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేఎస్.బసవంతప్ప మాట్లాడుతూ కొత్త జిల్లా ఆస్పత్రిని కేవలం భవనానికే పరిమితం చేయకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే ప్రజల ఆస్పతిగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో నిరంతరం పరిశుభ్రత పాటించాలన్నారు.
వైద్య సిబ్బందిని నియమించండి
అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విభాగాలను సమర్థవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఆధునిక వైద్య పరికరాలు, ప్రయోగశాలలు, ఇతర అత్యవసర వైద్య సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ఆస్పత్రి విజయనగర జిల్లాకే కాకుండా రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాలో మరిన్ని వైద్య సదుపాయాల అభివృద్ధి కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, ఈ అంశాన్ని బెళగావిలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో కూడా ప్రస్తావిస్తానని మంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో హొసపేటెలో చక్కెర కర్మాగారం ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి తెలిపారు. ఇందుకోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను సూచించామన్నారు. త్వరలోనే కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రారంభమైన నూతన జిల్లా ఆస్పత్రి ఇదే
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, ప్రజలు
జిల్లా ఇంచార్జి మంత్రి కేఎస్.బసవంతప్ప
ప్రభుత్వ 250 పడకల జిల్లా ఆస్పత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం
త్వరలో పేదలకు ఇళ్లస్థలాలు
ఇళ్లు లేని పేదలకు రానున్న రోజుల్లో 30 నుంచి 40 చదరపు మీటర్ల స్థలాలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ తుకారాం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నూతన విజయనగర జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధికి రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. 250 పడకల కొత్త జిల్లా ఆస్పత్రి ప్రారంభం జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విజయనగర ఎమ్మెల్యే హెచ్‌ఆర్.గవియప్ప అధ్యక్షత వహించగా, మరో మంత్రి యూటీ ఖాదర్, కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్‌టీ.శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.రూపేష్, హుడా అధ్యక్షుడు హెచ్.ఎన్.మహమ్మద్ ఇమామ్ నియాజీ, జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, అదనపు జిల్లాధికారి పీఎన్.లోకేష్, జిల్లా సర్జన్ శంకర్ నాయక్, ఆస్పత్రి నిర్మాణం కోసం భూమిని విరాళంగా అందించిన దాత విద్యాబాయితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


