రేషన్‌ జొన్నలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ జొన్నలు స్వాధీనం

Nov 29 2026 1:04 PM | Updated on Nov 29 2026 1:04 PM

● 13.50 క్వింటాళ్లు జప్తు

● ఒకరిపై కేసు నమోదు

హుబ్లీ: కరువుతో బియ్యం, జొన్నల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో పేదల దరికి చేరాల్సిన ప్రభుత్వ చౌక ధర డిపో జొన్నలు నల్లబజార్‌కు తరలిస్తుండగా ఆహార పౌరసరఫరాల శాఖ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సదరు శాఖ అధికారుల బృందం ఈ నెల 26న రాత్రి ఆదర్శ నగర్‌కు చెందిన నాగేష్‌ కృప అనే వ్యక్తి ఇంటి వెనుక భాగంలో అక్రమంగా నిల్వ చేసిన 45 కేజీల తూకం గల 30 బస్తాల జొన్నలను జప్తు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పరమేశప్ప చలవాదిపై అశోక్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రేషన్‌ పంపిణీలో భాగంగా బియ్యంతో పాటు జొన్నలను కూడా ప్రజలకు అందిస్తున్నారు. అవే జొన్నలు ప్రస్తుతం నల్లబజార్‌లో అమ్ముడవుతున్నాయని వెలుగులోకి వచ్చింది. దీంతో ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి విజయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కర్ణాటక నిత్యావసర వస్తువుల వితరణ చట్టం–1955 ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

నలుగురు గంజాయి విక్రేతల అరెస్ట్‌

హుబ్లీ: ధార్వాడ కళ్యాణ నగర మహామనె లేఅవుట్‌ పార్కు వద్ద గంజాయి విక్రయిస్తున్న, రవాణా చేస్తున్న నలుగురిని ధార్వాడ ఉప నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన నిందితులను గురురాజ్‌(24), శివప్రసాద్‌(26) విక్రాంత్‌ (30), షోకిల్‌ అహ్మద్‌ గా గుర్తించారు. వీరి నుంచి రూ.4500 విలువ చేసే 395 గ్రాముల గంజాయి, రూ.1500 నగదు, తూకం యంత్రాలు, నాలుగు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై ధార్వాడ ఉపనగర పోలీస్‌ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదైంది. జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ బూర్సే భూషన్‌, డీసీపీలు శృతి, రవీశ్‌, ఏసీపీ ప్రశాంత్‌ మార్గదర్శకత్వంలో ధార్వాడ ఉపనగర స్టేషన్‌ సీఐ ఎంకే బసాపుర, ఎస్‌ఐ రమేష్‌ నేతృత్వంలోని బృందం ఈనెల 24న ఈ దాడి చేసింది. ఈ కార్యాచరణలో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

ఇద్దరు గంజాయి పెడ్లర్ల అరెస్ట్‌

హుబ్లీ: హుబ్లీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు పెడ్లర్లను అరెస్ట్‌ చేసి రూ.17,600 విలువైన 352 గ్రాముల గంజాయి, రూ.200 నగదు స్వాధీనం చేసుకున్నారు. మంటూరుకు చెందిన మహమ్మద్‌ యాసిన్‌(21), అల్తాఫ్‌ నగర్‌కు చెందిన మహమ్మద్‌ ఫకృద్దీన్‌ (22) అరెస్టయిన నిందితులు. గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆ స్టేషన్‌ సీఐ ముస్తాక్‌ అహ్మద్‌ షేక్‌ నేతృత్వంలో సిబ్బంది దాడి చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు.

బైక్‌ ఢీకొని మహిళ మృతి

● మరొకరికి తీవ్ర గాయాలు

హుబ్లీ: రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన బైక్‌ ఢీకొనడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే మార్గమధ్యంలో మృతి చెందింది. మరొక మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన హుబ్లీ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అదరగుంచిలో చోటు చేసుకుంది. మృతురాలిని అదరగుంచి గ్రామానికి చెందిన విద్యా గుళేదగుడ్డగా గుర్తించారు. గాయపడిన మహిళ అదే గ్రామానికి చెందిన ద్రాక్షాయిణి. గండి దుర్గమ్మ దగ్గర ఇద్దరు మహిళలు రోడ్డు దాటుతుండగా హుబ్లీ వైపు నుంచి హావేరి వైపునకు వేగంగా వస్తున్న బైక్‌ ఢీకొంది. ప్రమాద తీవ్రతకు ఇద్దరూ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యాను తక్షణమే కేఎంసీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ద్రాక్షాయిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణకుడైన బైక్‌ చోదకుడి కోసం గాలింపు చేపట్టారు.

ప్రజా సేవ లబ్ధి పొందండి

బళ్లారిటౌన్‌: సమస్యల పరిష్కారం కోసం మీ ఇంటి ముంగిటకే వచ్చిన ప్రజా సేవను సద్వినియోగ పరుచుకోవాలని ఏసీ హెచ్‌డీ రాజేష్‌ పిలుపునిచ్చారు. శనివారం తాలూకాలోని హలకుంది గ్రామంలో సముదాయ భవనంలో చేపట్టిన ప్రజాసేవ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను సేకరించి మాట్లాడారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో ఐపీజీఆర్‌ పోర్టల్‌లో సమర్పించేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు జత చేయాలని సూచించారు. చట్టబద్ధంగా గుర్తించిన భూమిలో ఇళ్ల స్థలాలు ఇస్తామని, జిల్లాకు 15 లక్షల స్థలాలు మంజూరు అయ్యాయని, తొలి దశలో 5 లక్షల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్థలాలు, ఇళ్లు సరిగ్గా మంజూరు కావడం లేదని, వేసవిలో చెరువులో నీరు ఉండటం లేదని, సర్వర్‌ సమస్యతో రేషన్‌ షాపులో ధాన్యం పంపిణీకి సమస్య ఏర్పడుతోందని అసిస్టెంట్‌ కమిషనర్‌ దృష్టికి తెచ్చారు.

బస్సు, కారు ముఖాముఖి ఢీ

● స్థలంలోనే కారు డ్రైవర్‌ మృతి

● కొప్పళ జిల్లాలో రోడ్డు ప్రమాదం

హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకా ముక్కుంపి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, కారు ముఖాముఖిగా ఢీకొన్న ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ స్థలంలోనే మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గంగావతి నుంచి యలబుర్గా వైపు వెళుతున్న బస్సు కొప్పళ మీదుగా గంగావతి వైపునకు వస్తున్న కారును బలంగా ఢీకొంది. ప్రమాద తీవ్రతకు బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న గంగావతి గ్రామీణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement