రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తామని చిక్కోడి లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక జార్కిహోళి పేర్కొన్నారు. శనివారం చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కరోశి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ఆమె మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.
సంగీతానికి మారుపేరు
పంచాక్షరి గవాయి
రాయచూరు రూరల్: సంగీతానికి మారుపేరు పంచాక్షరి గవాయి అని కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య, సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య కొనియాడారు. వారు శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో పంచాక్షరి గవాయి పుణ్యారాధన, 46వ జాతీయ సంగీత సమ్మేళనంలో గురుగాన సంగీత కచేరీని ప్రారంభించి మాట్లాడారు. ఉత్తర కర్ణాటక సంగీతాన్ని దక్షిణ భారత రాష్ట్రాలకు వ్యాపింప చేసిన పండిత్ పంచాక్షరి గవాయి సంగీతానికి ప్రాణం పోశారని అభిప్రాయ పడ్డారు. సూగూరేష్, వడవాటి నరసింహులు, చుక్కి సూగప్ప, చంద్రశేఖర్, రంగస్వామి, వెంకటేష్, సుధాకర్‌లున్నారు.
విద్యాభివృద్ధికి సహకారం అవసరం
రాయచూరు రూరల్ : సమాజంలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం ఎంతైనా అవసరమని విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి పేర్కొన్నారు. శుక్రవారం సత్య ఉద్యానవనంలో చైతన్య టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. సంస్కారంతో పాటు జీవిత విలువలను వారు అలవర్చుకొనేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యా రంగంలో మార్కులు ముఖ్యం కాదని, ఉత్తమ వ్యక్తిత్వం, శిక్షణ, సంస్కారం, ఆచార విచారాలపై అవగాహన ఉండాలన్నారు.
ధర్మ సందేశాలు
అందరికీ చాటాలి
రాయచూరు రూరల్: దేశంలో హిందూ ధర్మ సందేశాలను అందరికీ చాటాలని కేదార మహాపీఠం జగద్గురు సింహాసనాధీశ్వర భీమాశంకర్ లింగ మహా భగవత్పాదులు అభిప్రాయ పడ్డారు. దేవదుర్గలోని శిఖర బృహన్మఠంలో ఏర్పాటు చేసిన అడ్డ పల్లకీ ఉత్సవాలు, కార్తీక మాస మహోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సనాతన సంప్రదాయాలు, ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతి ధర్మ ప్రచారంలో స్వామీజీలు ముందంజలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో కిల్లే బృహన్మఠం పీఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సిద్ద రామేశ్వర స్వామీజీ, శంభు సోమనాథ శివాచార్య తదితర స్వామీజీలున్నారు.
ప్రజాసేవ సభలతో
సమస్యలకు చెక్
హుబ్లీ: ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ప్రజా సేవ ఆందోళన సభలను జిల్లాలోని అన్ని తాలూకాల్లో నిర్వహించి సమస్యలను పరిష్కరించినట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్ లాడ్, ఆయా స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ప్రతి నెలలో అన్ని శనివారాలు ఈ సభలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ధార్వాడ తాలూకా హారోబెళవడిగి గ్రామ పంచాయతీలో ఉదయం 11 గంటలకు, అళ్నావర తాలూకా కుంబారగణవి గ్రామంలోని కరియమ్మ దేవి ఆలయంలో ఉదయం 10.30 గంటలకు, కలఘటిగిలో ఉదయం 10 గంటలకు తహసీల్దార్ కార్యాలయ సభాంగణంలో తహసీల్దార్ అధ్యక్షతన శనివారం ఈ సమావేశాలను నిర్వహించారు.


