పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం
● మా సార్వభౌమత్వం కోసం
పోరాటం: సీఎం డీకే
శివాజీనగర: పట్టణాలు, నగరాలలో రవాణా వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, చెత్త నిర్వహణ, పారిశ్రామిక రంగంలో జపాన్‌లోని ఉత్తమ విధానాలను కర్ణాటకలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ తెలిపారు. శనివారం విధానసౌధలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి జపాన్ పర్యటనపై మాట్లాడారు. పట్టణాభివృద్ధి, ఉత్పాదక రంగం పట్టణ రవాణా వ్యవస్థ మరియు వ్యర్థాల నిర్వహణలో జపాన్ నుంచి ఏమి నేర్చుకోవచ్చు? అంటే చాలానే ఉందని అన్నారు. ‘ఆ దేశపు సమయపాలన, క్రమశిక్షణ, నిబద్ధత ఆదర్శప్రాయమైనవి. వచ్చే ఏప్రిల్‌లో బెంగళూరులో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ కోసం వివిధ దేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నాము. నేను జపాన్ విదేశాంగ మంత్రి, రాయబారితో కూడా చర్చించాను. అందరూ సహకరిస్తామని హామీ ఇచ్చారు’ అని సీఎం తెలిపారు.
ఉత్తమ టౌన్‌షిప్‌లు, చెత్త నిర్వహణ
జపాన్‌లో కొత్త నగరాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణం, వాణిజ్య కార్యకలాపాల విస్తరణను పరిశీలించినట్లు సీఎం తెలిపారు. వ్యర్థాలతో 24 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఇంధన యూనిట్‌ను సందర్శించాను. కర్ణాటకలో కూడా అటువంటి ప్రాజెక్టు అమలు చేయాలని ఆహ్వానించాము. బెంగళూరులోనే కాకుండా, హుబ్లీ, ధార్వాడ, మైసూరు వంటి నగరాల్లో కూడా అమలు చేయవచ్చు. జపాన్‌లో మెట్రో రైలు సౌకర్యాన్ని గరిష్టంగా ఉపయోగిస్తారు. అక్కడి మెట్రో స్టేషన్లు వ్యవస్థీకృత వాణిజ్య కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. విమానాశ్రయం కంటే రైల్వే స్టేషన్లు మెరుగ్గా ఉన్నాయి. వాటి సమయపాలన, పరిశుభ్రతతో ఆదర్శనీయం. మనం కూడా మెట్రో స్టేషన్లను అలా సద్వినియోగం చేసుకోవాలి. దీనిపై అధికారులతో చర్చించాను అని సీఎం వివరించారు.
పెట్టుబడులకు
కంపెనీల ఆసక్తి
ప్రస్తుతం కర్ణాటకలో 525 జపనీస్ కంపెనీలు ఉన్నాయి, అనేక తయారీ యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి, తద్వారా ఉద్యోగాలు సృష్టించడమే మా లక్ష్యమని సీఎం చెప్పారు. రాష్ట్రంలో టయోటా ప్లాంట్
విస్తరణకు వారు ఆసక్తి చూపారన్నారు. బెంగళూరు దక్షిణలోని హరోహళ్ళిలో కవాసాకీ సంస్థ పెట్టుబడుల ద్వారా 600 మందికి సాంకేతిక ఉపాధి కల్పించేందుకు ఒక ఒప్పందం కుదిరిందని చెప్పారు. టాక్సీ తరహా హైబ్రిడ్ కార్లను మన రాష్ట్రంలో తయారు చేయాలని కంపెనీలను ఆహ్వానించామని చెప్పారు. దీనివల్ల స్థానిక ఆటోలకు ఎలాంటి సమస్య ఉండదన్నారు.
జపాన్ పట్టణాభివృద్ధి, చెత్త నిర్వహణపై అధిక దృష్టి
అందుకు జపాన్ పర్యటన దోహదం
సీఎం డీకే శివకుమార్
శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు సీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. ఈ బిల్లు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడతానని తెలిపారు. ‘నేను ఆదివారం ఢిల్లీలో ఉంటాను, అక్కడ కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంలతో కలిసి మీడియాతో మాట్లాడతాను. ఈ పునర్విభజన దక్షిణ రాష్ట్రాలకు ఎలా అన్నాయం చేస్తుందో వివరిస్తాను.. అని చెప్పారు. ఈ బిల్లు అమలైతే దక్షిణాది రాష్ట్రాలు మైనార్టీగా మారిపోతాయన్నారు. మా రాష్ట్రాల ప్రయోజనాల కోసం గొంతెత్తుతామన్నారు. దక్షిణ రాష్ట్రాలు అభివృద్ధితో దేశ ప్రగతికి బలాన్ని చేకూరుస్తున్నాయన్నారు. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీ భేటీలో బిల్లు లాభనష్టాల గురించి చర్చిస్తామన్నారు. బిల్లు అమలు చేయడం గురించి మీడియా ద్వారానే తెలిసిందని, అంతకు మించి సమాచారం రాలేదన్నారు. బీజేపీ తన సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తోందన్నారు. మేము మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తాము, కానీ మా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మేము పోరాడతామని స్పష్టంచేశారు. కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై మండిపడ్డారు. అధికారంలో ఉన్నపుడు కన్నడిగులకు, కర్ణాటకకు ఏమి చేశారో చెప్పాలి, పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదు అన్నారు.
కరువు సాయమే లేదు
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా సహాయం అందించలేదని సీఎం ఆరోపించారు. బెళగావి అసెంబ్లీ సమావేశాల వరకు వేచి ఉంటాము. ఒకవేళ సహాయం ఇవ్వకుంటే, ఆ తరువాత చలో ఢిల్లీ నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ బెంగళూరుకు వచ్చినప్పుడు తాను కరువు సాయం గురించి అడిగానన్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల విషయంలో కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు.


