● పొలాల్లో రైతుల నిరసన
మైసూరు: జిల్లాలోని కేఆర్ నగర తాలూకా హంపాపుర చివరి ఆయకట్టులోని వివిధ గ్రామాల రైతులు కాలువ చివరి భూములకు నీరు వదిలాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన వరి పైరును కాపాడి, తమను ఆదుకోవాలని రైతులు హంపాపుర గ్రామం వద్ద వరిపొలంలో నిరసన తెలిపారు. సోమవారంలోగా నీరు వదలకుంటే మంగళవారం కేఆర్‌నగర పట్టణ బంద్ చేస్తామని చెప్పారు. నీరు వదలకుంటే చేతికొచ్చిన వరి పైరు నోటికి అందకుండా పోతుందని , వరి తాలుగా వస్తుందన్నారు. ఇంకా 15 రోజుల పాటు నీరు ఇవ్వాలని, లేకుంటే మంచనహళ్లి, హంపాపుర, బడకనకొప్పలు, దొడ్డకొప్పలు, బాలూరు, అర్జునహళ్లి, కల్యాణపుర, సన్యాసిపుర గ్రామాల రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని తెలిపారు.
మైసూరులో బంగారు వ్యాపారి రూ.30 కోట్ల టోపీ
మైసూరు: మైసూరు తాలూకాలోని చిక్కహళ్లిలో ఓ బంగారం వ్యాపారి జనాన్ని నిండా ముంచాడు. దీపక్ జ్యువెలర్స్ అనే నగల షాపు యజమాని బాబులాల్ రూ.30 కోట్లకు పైగా మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు తెలిపిన మేరకు బాబులాల్ గత కొన్నేళ్లుగా నగల షాపు నిర్వహిస్తున్నాడు. బంగారు నగలు తయారు చేయడంతో పాటు స్కీములు కూడా నడిపేవాడు. నగలు చేయడానికి ప్రజలు ఇచ్చిన బంగారం, నగలు అమ్ముతానని తీసుకున్న నగదుతో నవంబరు 16 నుంచి మాయమయ్యాడు. సొంతూరు రాజస్థాన్‌కు వెళ్తున్నట్లు చెప్పి కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. సుమారు 100 మందికి పైగా స్థానిక ప్రజలకు టోపీ వేశాడని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది కూడా ఇతనికి బంగారం, డబ్బు ఇచ్చారు, ఇప్పుడు అందరూ అవాక్కయ్యారు. ఆలనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయగా మోసగాని కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు టోపీ వేసిన మొత్తం రూ.50 కోట్ల వరకూ ఉంటుందని కొందరు బాధితులు తెలిపారు.
హైవేపై కారు బూడిద
మండ్య: హైవేపై వెళ్తున్న కారు మంటలు అంటుకుని కాలి బూడిదైంది. ఈ ఘటన తాలూకాలోని చిక్కమండ్య దగ్గర శనివారం జరిగింది. బెంగళూరువాసులు జగదీష్, వీణా హిరేమఠ్ బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్తుండగా, ఘటనాస్థలికి రాగానే కారు ఇంజిన్‌లో నుంచి పొగలు వచ్చి ఆపై మంటలు వ్యాపించాయి. కారులోని వారు ముందే దిగిపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చి ఆర్పేటప్పటికి పూర్తిగా దగ్ధమైంది.


