బోనులో పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

బోనులో పెద్దపులి

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

మైసూరు: జిల్లాలోని హెచ్‌డి కోట తాలూకాలోని హోసహోళలు గ్రామంలో పెద్ద పులి చిక్కింది. సమీప అడవిలో నుంచి తరచూ పులి గ్రామం చుట్టుపక్కల తిరుగాడడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. అటవీ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేయగా, దానిని పట్టుకోవడానికి పలుచోట్ల బోనులు పెట్టారు. ఆదివారం రాత్రి ఓ బోనులో పులి పట్టుబడింది. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. దానిని అటవీ శాఖ సిబ్బంది తరలించారు.

గోవా టూర్‌కు ప్లాన్‌.. రూ.3.60 లక్షల టోపీ

మైసూరు: గోవా టూర్‌కి వెళ్లాలని ఆన్‌లైన్‌లో హోటల్‌ గది, క్యాసినో బుక్‌ చేసుకున్న ఆరుగురు వ్యక్తులు రూ. 3.60 లక్షలు పోగొట్టుకున్న ఘటన నగరంలో జరిగింది. మైసూరులోని గిరియబోవి పాల్యకు చెందిన నాగరాజ్‌, అతని ఐదుగురు స్నేహితులు గోవా వెళ్లి మజా చేయాలనుకున్నారు. ఫేస్‌బుక్‌లో గాలించగా బిగ్‌ డాడీ క్యాసినో వెబ్‌సైట్‌లోకి వెళ్లారు. కొంతసేపటికి వారి మొబైల్‌కు సుహాస్‌ అనే వ్యక్తి నుంచి కాల్‌ వచ్చింది. మీరు క్యాసినో, గది బుక్‌ చేసి, విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తానని, దీనికి రూ. 3 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. అతని మాటలు నమ్మి రూ.3 లక్షల బదిలీ చేశారు. కొంతసేపటికి మళ్ళీ ఫోన్‌ చేశాడు. మీ ప్యాకేజీ ఖరీదు రూ. 5 లక్షలు, మీరు రూ. 60 వేలు డిపాజిట్‌ చేయాలనగా, ఆ డబ్బులు పంపించారు. తర్వాత నాగరాజ్‌ సుహాస్‌కు ఫోన్‌ చేయగా అతని మొబైల్‌ స్విచాఫ్‌ వచ్చింది. దీంతో నజరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఊపిరి తీసిన పొగబండి

అవ్వ, ఇద్దరు మనవరాళ్ల మృతి

దొడ్డబళ్లాపురం వద్ద దుర్ఘటన

దొడ్డబళ్లాపురం: రైలు పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని అవ్వ, ఇద్దరు మనవరాళ్లు చనిపోయిన విషాద సంఘటన దొడ్డబళ్లాపురం రైల్వేస్టేషన్‌ వద్ద జరిగింది. మృతులను హిందూపురం వాసులు ఇర్ఫానా (52), రుకియా (13), రాకియా (8)లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం పిల్లలు హిందూపురం నుంచి ముత్తూరులోని అవ్వ ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం తిరిగి హిందూపురం వెళ్లడానికి అవ్వతోపాటు రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నారు. పట్టాలపై నడుచుకుంటూ వస్తుండగా వేగంగా వచ్చిన ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొంది. దీంతో ముగ్గురూ దూరంగా ఎగిరిపడి మరణించారు. కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యశవంతపుర రైల్వే పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

రొట్టెలే గతి..

కావేరి నీటికై రైతుల ధర్నా

మండ్య: కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేస్తున్నారని, తమకు నీళ్లు లేకుండా చేస్తున్నారని కన్నడసేన, కన్నడాంబె రక్షణ వేదిక కార్యకర్తలు బెంగళూరు–మైసూరు హైవేలో జొన్నరొట్టెలు పట్టుకుని ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు రొట్టె భాగ్యం ఇస్తోందన్నట్లుగా రొట్టెలు తింటూ వ్యంగ్య ప్రదర్శన చేశారు. తమిళనాడుకు నీటిని విడుదల చేయబోమని చెప్పిన ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి వారి అధికారాన్ని నిలుపుకోవడానికి రైతులను బాధితులుగా చేస్తున్నారని ఆరోపించారు. కబిని జలాశయాన్ని ఖాళీ చేశారు, కేఆర్‌ఎస్‌ డ్యాంలో నీళ్లు తక్కువగా ఉన్నా తమిళనాడుకు వదిలేస్తున్నారు అని దుయ్యబట్టారు. జలాశయంలోకి వచ్చే నీటి కంటే బయటకు వదిలే నీరే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. కేఆర్‌ఎస్‌లోకి 5,426 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే, తమిళనాడు కోసం 7,170 క్యూసెక్కులు వదులుతున్నారని ఆరోపించారు. మండ్యలో పంటలు వేయరాదని చెబుతూ, తమిళనాడులో వ్యవసాయానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement