● కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి
తుమకూరు: కేపీఎస్‌సీ కుంభకోణాన్ని బయటపెట్టకుండా వదిలిపెట్టబోమని, పారిపోబోమని, చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి హెచ్.డి.కుమారస్వామి.. రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేకు సవాలు విసిరారు. తుమకూరులోను, ఢిల్లీలోను కుమారస్వామి విలేకరులతో మాట్లాడారు. ‘నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరంతా కేవలం ఎక్స్‌లో ఎందుకు మాట్లాడుతున్నారు? మీడియాను ఎదుర్కొనే ధైర్యం మీకు లేదా?’ అని కాంగ్రెస్ మంత్రులను ఆయన ప్రశ్నించారు. గత వారం రోజులుగా కేపీఎస్‌సీ పరీక్షలు, నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోందని, ప్రియాంక్ ఖర్గే ట్వీట్లు చేస్తూ మంచి పరిపాలనను తానొక్కడే అందిస్తున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత సిద్దరామయ్య ప్రభుత్వంలో ప్రియాంక్ ఖర్గే పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన శాఖలో 24 మంది అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని కుమార ఆరోపించారు. ఓఎంఆర్ షీట్లను మళ్లీ మళ్లీ దిద్దారు, హడావుడిగా తుది జాబితాను విడుదల చేశారన్నారు. వివరాలన్నీ సేకరించి భద్రపరిచానని ఆయన తెలిపారు. వెటర్నరీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో కూడా భారీ కుంభకోణం జరిగిందని అన్నారు.
రాహుల్ మాట్లాడాలి
కేపీఎస్‌సీ స్కాంకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమమని, దీనిపై రాహుల్‌గాంధీ మాట్లాడాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ బెంగళూరుకు వచ్చి కేపీఎస్‌సీ బాధితులతో చర్చించాలన్నారు.


