● ముగ్గురు ఎస్‌ఐల ఆడియో లీక్..
వెంటనే సస్పెండ్
యశవంతపుర: మేము ఫలానా చోటుకు బదిలీ కావడానికి పోలీసు ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చుకున్నాం, ఏం చేయాలి మరి.. తప్పదు అని ఫోన్‌లో ముగ్గురు ఎస్‌ఐ మిత్రులు మాట్లాడుకున్న ఆడియోలు వైరల్ కావడంతో పోలీసుశాఖకు తలనొప్పిగా మారింది. ఇంటి గుట్టును రట్టు చేస్తారా? అని ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తరకన్నడ జిల్లాలో ముగ్గురు ఎస్‌ఐలను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ అదేశించారు. హళియాళ ఠాణా ఎస్‌ఐ కిరణ్ పాటిల్, క్రైమ్ ఎస్‌ఐ కృష్ణ, హలియాళలో ఎస్‌ఐగా పని చేసి బదిలీ అయిన వినోద్‌రెడ్డిలు బదిలీలు, పోస్టింగ్‌ల కోసం ముడుపులు ముట్టజెప్పామని ఫోన్ సంభాషణల్లో మాట్లాడుకున్నారు. ఈ ఆడియో ఎలా ప్రచారంలోకి వచ్చింది. దీంతో పోలీసు అధికారులు ఆగ్రహం పట్టలేక ముగ్గురినీ సస్పెండ్ చేశారు. ఆడియో లీకేజీ, ముడుపుల తదితరాలపై ఓ డీఎస్పీతో విచారణకు ఆదేశించారు.
రామనగరలో దొంగనోట్ల ముద్రణ
● భారీగా పట్టివేత
దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకాలో దొంగనోట్ల దందా గుట్టురట్టయింది. నిర్మాణదశలో ఉన్న భవనంలో రహస్యంగా దొంగనోట్లు ముద్రిస్తున్నట్టు సమాచారం అందడంతో ఐజూరు పోలీసులు దాడి చేశారు. భారీ మొత్తంలో దొంగనోట్లు దొరికాయి. శాంతిలాల్ లేఔట్‌లో కొత్తగా నిర్మిస్తున్న సంతోష్ అనే వ్యక్తికి చెందిన భవనంలో ఈ బాగోతం సాగుతోంది. కొందరు ముఠాగా ఏర్పడి ప్రత్యేకమైన పేపర్ షీట్లు తీసుకువచ్చి వాటికి కొన్ని రసాయనాలు పూసి రూ.200, రూ.500 విలువ గల నకిలీ నోట్లు ముద్రిస్తున్నారు. వాటిని బయట చలామణి చేసేవారు. పోలీసులు ముద్రణా సామగ్రి, పెద్ద మొత్తంలో దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. అరెస్టుల గురించి పోలీసులు నోరుమెదపడం లేదు. పూర్తి ముఠాను పట్టుకున్న తరువాత వివరాలను ప్రకటించే అవకాశముంది.
నేత్రపర్వంగా ఉత్తరారాధన
కోలారు: నగరంలోని బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో రాయర 355వ ఆరాధనా మహోత్సవంలో భాగంగా రాయర బృందావనానికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సోమవారం ఉత్తరారాధన సాగించారు. బృందావనానికి పంచామృత అభిషేకం, గంధ పుష్ప అలంకరణ, గురు పాదపూజ, కనకాభిషేకం, మహా మంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం భక్తీ గీతాల ఆలాపన, మండపోత్సవం, తొట్టెలు పూజ, మహా మంగళారతి, తదితర పూజా వేడుకలు భక్తులను తన్మయుల్ని గావించాయి.


