ఓటర్లకు పరీక్ష సర్‌ | - | Sakshi
Sakshi News home page

ఓటర్లకు పరీక్ష సర్‌

Jun 30 2026 2:41 AM | Updated on Jun 30 2026 2:41 AM

సాక్షి, బెంగళూరు: దేశంలో పలు రాష్ట్రాల్లో పూర్తయిన సంచలనాత్మక సర్‌ కన్నడనాట ఆరంభం కాబోతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌–సర్‌) సర్వే ప్రక్రియ మంగళవారం నుంచి చేపడుతున్నారు. జూలై 29 వరకు కొనసాగనుంది. బూత్‌ లెవెల్‌ అధికారులు (బీఎల్‌ఓ)లు ఇంటింటికీ వచ్చి ఓటర్ల సమాచారం సేకరిస్తారు. ప్రతి ఓటును సక్రమమా, కాదా అని భూతద్దంతో తనిఖీ చేయడమే సర్‌ లక్ష్యం. తర్వాత ఈసీ తుది జాబితాను అక్టోబర్‌ 7న ప్రకటిస్తుంది. రాష్ట్రంలో 59,050 మందికి పైగా బీఎల్‌ఓలు ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం 5,55,74,064 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రక్రియలో సహకారానికి ప్రతి రాజకీయ పార్టీ ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక ఏజెంట్‌ను నియమించింది.

ఎలా ఉంటుంది?

ఇంటింటికి వచ్చే బీఎల్‌ఓలు ఓటరుకు ఓ దరఖాస్తును ఇచ్చి పలు వివరాలతో భర్తీ చేయాలని సూచిస్తారు. భర్తీ చేయడానికి కొన్నిరోజుల సమయం ఇస్తారు. తరువాత ఆ ఫారాన్ని బీఎల్‌ఓకు తిరిగి ఇవ్వాలి. మరణించిన, లేదా ఇళ్లను ఖాళీ చేసి ఉండే ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. రెండు చోట్ల ఓటు ఉండే వారిని తీసేస్తారు. కొత్తగా ఓటు హక్కు కల్పించడం, సవరణలను ఈ సమయంలో నిర్వహించబోరు. కొన్ని రాష్ట్రాల్లో.. ఓటరుగా చేర్చుకోవాలని బీఎల్‌ఓలను కోరితే నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

2002లో ఎక్కడ ఓటు ఉందో ఆధారాలు సిద్ధం చేసుకోండి

నేటి నుంచి జూలై 29 వరకు ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ

నిర్వహణపై ఉత్కంఠ

ఇతర ముఖ్యాంశాలు

సీఈఓ కర్ణాటక వెబ్‌సైట్‌ లేదా ఈసీఐనెట్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను వినియోగించి ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో నిర్ధారించుకోవాలి.

సీఈవో కర్ణాటక వెబ్‌సైట్‌లో రాష్ట్రంలోని ప్రతి జిల్లా బూత్‌ బీఎల్‌ఓ నంబర్లు ఉన్నాయి. ఓటర్లు వారిని సంప్రదించాలి.

అవసరమైన డాక్యుమెంట్లు..

కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డు..

ఓటర్‌ గుర్తింపు కార్డు

ఆధార్‌ కార్డు

అడ్రస్‌ ఫ్రూఫ్‌

రెండు పాస్‌పోర్టు ఫోటోలు

2002 వివరాలు ప్రధానం

2025, 2002 ఓటర్ల జాబితాలో రెండింట్లో పేర్లు ఉండి, వివరాల్లో వ్యత్యాసాలు, తేడాలు ఉంటే నోటీసులు ఇస్తారు. 2025 ఓటర్ల జాబితాలో పేరు ఉండి, 2002 జాబితాలో తమ, లేదా తమ తల్లిదండ్రుల పేర్లు లేకపోయినా నోటీసులు ఇస్తారు. నోటీసులు అందుకున్న వెంటనే జాబితా నుంచి పేర్లను తొలగిస్తారు. నోటీసులు అందుకున్న వారు ధ్రువీకరణ పత్రాల ద్వారా తమ అర్హతను నిరూపించుకుని ఓటర్ల జాబితాలో చేరవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement