కారును అడ్డగించి, రూ.20 లక్షల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

కారును అడ్డగించి, రూ.20 లక్షల దోపిడీ

Jun 30 2026 2:41 AM | Updated on Jun 30 2026 2:41 AM

దొడ్డబళ్లాపురం: కారులో వెళ్తున్న బంగారం వ్యాపారిని అడ్డగించి దోపిడీకి పాల్పడ్డ సంఘటన మంగళూరు పరిధిలోని బైకంపాడి రహదారిపై జరిగింది. మహారాష్ట్రలోని సాంగ్లి నివాసి, బంగారం వ్యాపారి వికాస్‌ బాధితుడు. ముంబైలో బంధువుల వివాహం చూసుకుని కుటుంబ సమేతంగా కేరళలోని పయన్నూరుకు వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 2 గంటల దుండగులు కారులో దూసుకొచ్చి అడ్డుకున్నారు. వికాస్‌, కుటుంబ సభ్యుల వద్ద ఉన్న 180 గ్రాముల బంగారం, నగదు కలిపి మొత్తం రూ.20 లక్షలు దోచుకున్నారు. వికాస్‌ను కారులోంచి దించేసి భార్య, కుమారున్ని కారులోనే బలవంతంగా కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు. కాస్త దూరంలో కూళూరు వద్ద వారిద్దరినీ కూడా దించేసి కారుతో పాటు పరారయ్యారు. ఓ ఇన్నోవా కారులో 7 మంది దుండగులు అడ్డగించి, దోచుకున్నారని సురత్కల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రీల్స్‌ తీస్తూ

కొండ మీద నుంచి పడి..

తుమకూరు: సోషల్‌ మీడియాలో రీల్స్‌ పిచ్చితో ఓ లెక్చరర్‌ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తుమకూరు తాలూకా బళ్లాపుర కు చెందిన శివప్రసాద్‌ అరసికెరె ఓ ఇంటర్‌ కాలేజ్‌లో లెక్చరర్‌. ఆదివారం దేవరాయనదుర్గ కొండకు వెళ్లాడు. ఈ సమయంలో కొండపై దేవాలయం వెనుక ప్రమాదకరంగా ఉండే బండపై నిలబడి మొబైల్‌లో రీల్స్‌ తీసుకుంటూ జారిపడిపోయాడు. అక్కడే ఉన్న ఇతర పర్యాటకులు అతనిని రక్షించారు. రెండు కాళ్లకు తీవ్ర దెబ్బతగిలి నడవలేని స్థితిలో ఉన్న బాధితున్ని తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సొంతూరిలో

ప్రభుదేవా కులాసా

మైసూరు: ప్రభుదేవా అంటే ఎంత ప్రముఖ నటుడు, డ్యాన్సరో చెప్పాల్సిన పని లేదు. కానీ సొంతూరికి వస్తే మామూలు మనిషైపోతాడు. మైసూరు తాలూకా జయపుర హోబళి దూర గ్రామానికి వచ్చిన ఆయన స్నేహితులతో కలసి నేలపై కూర్చొని భోజనం చేశారు. స్వగ్రామంలో జీర్ణోద్ధరణ చేసిన తమ కుల దైవం మలే మహదేశ్వర దేవస్థానంలో ప్రత్యేకంగా పూజ చేశారు. బాల్యంలో ఆడిపాడిన స్నేహితులతో భోజనం చేశారు. స్నేహితులు సీఆర్‌ మంజు, ఉమేశ్‌ తదితరులు ఉన్నారు. తరువాత ప్రభుదేవా చైన్నెకు వెళ్లిపోయారు.

సీఈటీలో ర్యాంకు రాలేదని ఆత్మహత్య

శివమొగ్గ: మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయగా 20 రోజులు పోరాడి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన శికారిపురలో జరిగింది. జయంత్‌ (19) అనే విద్యార్థి వినాయకనగరలో నివసించే ప్రైవేటు బస్సు ఏజెంట్‌ హాలేశ్‌ కుమారుడు. జూన్‌ 6న కేసెట్‌ పరీక్షలో జయంత్‌కు తక్కువ మార్కులు వచ్చాయి. కోరుకున్న కోర్సులో సీటు రాదని మథనపడసాగాడు. ఈ కారణంతో ఇంట్లో పురుగుల మందు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, మెరుగుపడలేదు. దీంతో శివమొగ్గలో ప్రైవేటు ఆస్పత్రిలో, ఆపై మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స ఫలించక ఆదివారం మరణించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement