కాషాయంలో మరో కుదుపు | - | Sakshi
Sakshi News home page

కాషాయంలో మరో కుదుపు

Jun 30 2026 2:41 AM | Updated on Jun 30 2026 2:41 AM

సదానందగౌడ, విజయేంద్ర

బనశంకరి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌తో సతమతమవుతున్న రాష్ట్ర బీజేపీకి ఆడియో లీక్‌ రూపంలో మరో కష్టం ఎదురైంది. రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్రను పదవి నుంచి తొలగించాలంటూ మాజీ సీఎం డీవీ.సదానందగౌడ, ఓ కేంద్ర నేతతో మాట్లాడారనే ఆడియో వ్యాప్తి చెందింది.

ఆడియోలో ఏముంది..?

విజయేంద్ర పదవీకాలం అక్టోబరు వరకు ఉంటుంది, ఆ తరువాత సాగనంపండి అని సదానంద కేంద్ర నేతలను కోరారు. ఇప్పుడే తొలగిస్తే ఓ వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి టైం ముగిసే వరకూ కొనసాగించాలని చెప్పడం గమనార్హం. అతన్ని తప్పించాక కొత్తవారిని నియమించాలని ఆయన సూచించారు. ఇందుకు ఆ కేంద్ర నేత స్పందిస్తూ.. విజయేంద్ర విషయంలో బీఎల్‌.సంతోష్‌ , కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి డబుల్‌గేమ్‌ ఆడుతున్నారు, జోషి గేమ్‌ ప్లాన్‌ చేస్తున్నారని చెప్పారు. సదానందగౌడ బదులిస్తూ.. నేను దేవున్ని నమ్మాను, నేను ఇప్పటికీ బస్టాండులో దిగితే 30–40 మంది ఆటోడ్రైవర్లు, ప్రజలను నన్ను కలుస్తారు, ఈ స్థాయిలో నాయకత్వాన్ని నడిపించాను అని ఆడియోలో చెప్పారు.

ఏమీ మాట్లాడను: సదానంద

తన సంభాషణ వైరల్‌ కావడంపై సదానందగౌడ మాట్లాడుతూ ఆడియో గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, దీని గురించి తనకు తెలియదని చెప్పారు. ఆడియో గురించి నిజానిజాలు బయటకు రావాలి, తన గురించి చాలారోజులుగా చర్చ జరుగుతోంది, కోర్‌ కమిటీ భేటీలో కొన్ని వ్యాఖ్యలు చేశానని, కేంద్ర, రాష్ట్రనేతలు అడిగితే సమాధానం ఇస్తానని స్పష్టంచేశారు.

యడ్డి వర్గం ఆగ్రహం

విజయేంద్రను తొలగించాలనడంపై ఆయనతో పాటు యడియూరప్ప వర్గం నేతలు సదానందపై గుర్రుమంటున్నారు. మాజీ ఎంపీ రేణుకాచార్య దావణగెరెలో మాట్లాడుతూ యడియూరప్ప ఆశీర్వాదంతో సదానంద ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. ఏదైనా కుట్ర జరిగితే ఊరుకునేది లేదని, విజయేంద్ర చురుకై న నాయకుడని, రాష్ట్రంలో అనేక పోరాటాలు చేస్తున్నారన్నారు. సదానందగౌడ ఆడియోతో బీజేపీలో అంతర్గత కలహాలు చాలా తీవ్రంగా ఉన్నట్లు బహిర్గతమైంది. ఇది బీజేపీలో సంచలనం కలిగిస్తోంది. మాట్లాడుకున్న నాయకులు ఇద్దరూ తమ ఆడియోను లీక్‌ చేసి ఉండరు. ఎవరు వైరల్‌ చేశారనేదానిపై భిన్న వాదనలున్నాయి.

విజయేంద్రను అధ్యక్ష పదవి నుంచి సాగనంపాలన్న సదానంద

కేంద్ర నేతతో మాట్లాడిన కాల్‌ లీక్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement