నెత్తురోడిన రోడ్లు | - | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రోడ్లు

Jun 30 2026 2:41 AM | Updated on Jun 30 2026 2:41 AM

సాక్షి,బళ్లారి: బళ్లారి, చిత్రదుర్గ జిల్లాల్లో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు నెత్తురోడాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. సోమవారం జిల్లాలోని సండూరు నియోజకవర్గంలోని కుడితిని పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. అక్కడి సుల్తాన్‌పుర రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ ఢీకొనడంతో కురుగోడు తాలూకా ఎమ్మిగనూరుకు చెందిన జగదీష్‌(28), ఓర్వాయికి చెందిన బసప్ప(26) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కుడితిని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అపార ఇనుప ఖనిజ నిల్వలకు నిలయమైన సండూరు నియోజకవర్గంలో ఇనుప ఖనిజం తరలించే టిప్పర్లతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. టిప్పర్ల అతివేగంతో పాటు ఇష్టానుసారంగా వాహనాలు ఉపయోగిస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ద్విచక్ర వాహనాల్లో వెళ్లేటప్పుడు టిప్పర్లు ఢీకొని మృత్యువాత పడుతున్నారు.

అతివేగంతో అనర్థం

గనుల్లోని ఇనుప ఖనిజాన్ని తరలించే టిప్పర్లు నిత్యం వందలాదిగా తరలి వస్తుండటంతో ఇరుకై న రోడ్లతోపాటు గుంతలమయంగా ఉన్న రోడ్డు అతివేగంగా దూసుకొచ్చి ప్రాణాలు హరిస్తున్నాయి. సామర్థ్యానికి మించి ఇనుప ఖనిజం లోడ్లు తీసుకెళ్లడం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడంతో ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారితో పాటు పాదచారులపైకి కూడా టిప్పర్లు దూసుకొచ్చి ప్రాణాలు తీస్తున్నాయి. స్థానికులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్‌ పరిశ్రమల వల్ల పలువురు కోట్లకు పడగలెత్తేందుకు దోహదం చేస్తున్నాయి. కాని ప్రజల భద్రతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లారీ, ప్రైవేటు బస్సు ఢీ

చెళ్లకెరె రూరల్‌ : డ్రైవర్‌ అదుపు తప్పిన లారీ డివైడర్‌ను ఢీకొని అనంతరం ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడిన ఘటన తాలూకాలోని చిక్కమ్మనహళ్లి వద్ద సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సింధనూరు నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేటు బస్సును ఎదురుగా మరో వైపు నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ పైకెక్కిన అనంతరం అటు వైపు రోడ్డుపై వెళుతున్న ప్రైవేటు బస్సును ఢీకొంది. ఘటనలో ప్రైవేటు బస్సు బోల్తా పడగా, బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన వారు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని తరలి వెళ్లారు. చెళ్లకెరె పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

టిప్పర్‌, బైక్‌ ఢీ.. ఇద్దరు మృతి

మృతుల కుటుంబాల్లో విషాదం

టిప్పర్ల దూకుడుతో ప్రమాదాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement