● నిందితుడు అరెస్ట్
హుబ్లీ: రూ.500 అప్పు విషయానికి సంబంధించి ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన నగరంలో వెలుగు చూసింది. ఆటో డ్రైవర్ ఈరణ్ణ ఉరకడ్లి(45)పై ఈ నెల 25న శశిధర్ దాడి చేసినట్లు చెబుతున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఈరణ్ణను తక్షణమే కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన ఆదివారం రాత్రి మృతి చెందారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం శశిధర్ వద్ద ఆటో డ్రైవర్ ఈరణ్ణ రూ.500 అప్పు చేశాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శశిధర్ రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై బెండిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
పైకప్పు కూలిన ఘటనలో మరొకరు మృతి
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ పట్టణంలో ఆదివారం ఓ ఇంటి పైకప్పు కూలి అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా తీవ్రంగా గాయపడ్డ మరో విద్యార్థి ఆస్పత్రిలో కన్నుమూశాడు. అరకెర తాలూకా క్యాదిగేర నాగరాజ్(16), సముద్ర రవి(19) ఘటనా స్థలంలోనే మరణించగా, దేవదుర్గ తాలూకా కోతిగుడ్డ అర్జున్(19) ఆస్పత్రిలో మరణించారు. దేవదుర్గ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని ప్రజలు డిమాండ్ చేశారు.
డ్రైనేజీల్లో పూడికతీత
రాయచూరు రూరల్: కొప్పళ నగరసభ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని విన్నవించినా ఫలితం లేకపోవడంతో కాలనీ వాసులు రాస్తారోకో చేసిన విషయంపై సాక్షి దినపత్రికలో వార్త వెలువడిన సంగతి విదితమే. దీంతో నగర ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు కాలువల్లో పూడిక సమస్యపై సోమవారం నగరసభ అధికారులు స్పందించారు. పౌర కార్మికులతో పూడిక తొలగింపునకు చర్యలు చేపట్టారు. మురుగు కాలువల్లో పేరుఉకన్న పూడిక, చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు.
చలిస్తున్న కారులో మంటలు
హుబ్లీ: బెళగావిలో చలిస్తున్న కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంట్రుక వాసిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. బెళగావిలోని ప్రసిద్ధ రామ్‌దేవ్ హోటల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నడుస్తున్న కారులో ఆకస్మికంగా మంటలు కనిపించాయి. తక్షణమే అప్రమత్తమైన డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపారు. మంటలు మొత్తం కారుకు వ్యాపించేలోపే అందులోని వారందరూ కిందకు దిగడంతో భారీ ముప్పు తప్పింది. కళ్లెదుటే కారు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని నీళ్లు చల్లి కారుకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు.
ఘనంగా తిమ్మప్ప రథోత్సవం
రాయచూరు రూరల్ : రాయచూరు తాలూకాలో బోళబండి తిమ్మప్ప స్వామి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. బోళమానదొడ్డిలో వెలసిన బోళబండి తిమ్మప్ప స్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం పాదుకా పట్టాభిషేకం, జలాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. భక్తులు తిమ్మప్ప ఆలయంలో విశేష పూజలు చేశారు. భక్తుల ఆధ్వర్యంలో స్వామి వారికి ఉత్సవ సేవలను చేపట్టారు. గోవిందు, నరసణ్ణ, అయ్యాళప్ప, ఆంజనేయ, హన్మంతు, రాజు, జంబన్న, నరసింహులు, రామకృష్ణ తదితరులున్నారు.


