ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదాం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదాం

Jun 30 2026 2:41 AM | Updated on Jun 30 2026 2:41 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ, జనతాదళ్‌ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా సోషియల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌డీపీఐ) ఎదుగుదామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ మజీద్‌ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని మహిళా సమాజ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు దీటుగా కార్యకర్తలు పని చేయాలన్నారు. త్వరలో జరగనున్న నగరసభ, తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సమస్యలపై స్పందించాలన్నారు. సమస్యలపై పోరాటాలు చేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎస్‌డీపీఐని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు శ్రమించాలన్నారు. సర్‌ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో ఇలియాస్‌ తుంబే, అబ్దుల్‌ హునాన్‌, రియాజ్‌, అబ్దుల్‌ పటేల్‌, అక్బర్‌ హుసేన్‌, ఖాదర్‌ పాషా, రఫియుద్దీన్‌, మహ్మద్‌ జుయిల్‌లున్నారు.

వైభవంగా మారెమ్మ దేవి ఉత్సవాలు

రాయచూరు రూరల్‌ : రాయచూరులో మారెమ్మ దేవి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నగరంలోని మహావీర సర్కిల్‌ సమీపంలో వెలసిన కందగడ్డ మారెమ్మ దేవి ఆలయంలో భక్తులు తెల్లవారు జామున ఊయల సేవను చేపట్టారు. భక్తులు ఆలయంలో అమ్మవారికి అభిషేకం, పాదుకా పట్టాభిషేకం, జలాభిషేకం, పుష్పాలంకరణతో విశేష పూజలు చేశారు.

రంగస్థల కళలను కాపాడుకోవాలి

రాయచూరు రూరల్‌: సమాజంలో నశించి పోతున్న రంగస్థల కళలను కాపాడుకోవాలని ఎయిమ్స్‌ పోరాట సమితి నాయకుడు బసవరాజ్‌ కళస పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రంగ సిరి కళా సంఘం, వీధి నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సీజీకే అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మాట్లాడారు. టీవీ, మొబైల్‌ వాడకం లేని సమయంలో నాటక రంగ కళలకు ప్రాధాన్యత ఉండేదన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో కళలకు ఆదరణ కరువైందన్నారు. సీజీకే అవార్డులను శివ కుమారి, మరియమ్మలకు అందించారు. కార్యక్రమంలో హక్కి నరసప్ప, కోరెనాళ్‌, బసవరాజ్‌, భీమరాయ, రంగస్వామిలున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement