ప్రేయసి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేయసి దారుణ హత్య

Jun 30 2026 2:41 AM | Updated on Jun 30 2026 2:41 AM

కెలమంగలం: మలెమహదేశ్వర స్వామి కొండకు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు కారును అడ్డగించి ప్రేయసిని హత్య చేశారు. పోలీసులకు భయపడిన ప్రియుడు తన తల్లితో కలసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం డెంకణీకోట సమీపంలో వెలుగు చూసింది. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా ఉప్పారపల్లి గ్రామానికి చెందిన అర్చకుడు మాదప్ప కొడుకు రాజశేఖర్‌ (30). కెలమంగలం సమీపంలోని చిన్నట్టి బస్టాప్‌ వద్ద జిరాక్స్‌ దుకాణం పెట్టుకున్నాడు. రాజశేఖర్‌ కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన నళినిని ప్రేమించాడు. పెళ్లి జరిపించేందుకు ఇరువైపుల తల్లిదండ్రులు అంగీకరించారు. ఈనెల 22వ తేదీన రాజశేఖర్‌, నళిని కారులో మలెమహదేశ్వర స్వామి కొండకు వెళ్లారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురు దుండగులు కారును అడ్డగించి నళినిని హత్య చేసి కాల్చి పడేశారు. వారి నుంచి తప్పించుకుని గ్రామానికి చేరుకున్న రాజశేఖర్‌ విషయాన్ని పోలీసులకు చెప్పకుండా కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఆదివారం రాత్రి తల్లి మంజులతో కలిసి చిన్నట్టికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి కారులో బయలుదేరిన రాజశేఖర్‌.. అర్థరాత్రి సమయంలో తన స్నేహితుడికి ఫోన్‌ ద్వారా డెత్‌నోట్‌ పంపించాడు. తన ప్రేయసి నళిని హత్యకు గురైందని.. ఈ ఘటనతో భయాందోళనకు గురైనట్లు వివరించారు. తల్లితో కలసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కెలమంగలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చెరువు కట్టపై కారు కనిపించడంతో పోలీసులు చెరువులో గాలించారు. రాజశేఖర్‌, మంజుల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మనస్తాపం చెందిన ప్రియుడు

తల్లితో కలసి చెరువులోకి దూకి ఆత్మహత్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement