మండ్య: ఒత్తిడితో కూడిన జీవితంలో బాధను మరిచిపోవడానికి సంగీతమే ఉత్తమ మార్గమని, మనం తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు సంగీతం వినడం మన మనసును మార్చగలదని మాజీ ఎమ్మెల్సీ కె.టి.శ్రీకాంత్‌గౌడ అన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలను నగరంలోని శివనంజప్ప పార్కులో ప్రతిభాంజలి సుగమ సంగీత్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ సంగీత పురస్కారాలను పలువురు గాయకులకు ప్రదానం చేశారు. ప్రపంచం సంగీతాన్ని కోరుకుంటోంది, అది మరో ఆత్మ వంటిది, సంగీతానికి స్వస్థపరిచే శక్తి ఉంది అని వక్తలు పేర్కొన్నారు. ఒకప్పుడు రాజుల ఆస్థానాలకే పరిమితమైన సంగీతం ఇప్పుడు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. మరింత మంది యువ గాయకులు ముందుకు రావాలని, బార్‌లు, రెస్టారెంట్లకు బదులు సంగీత బోధనాలయాలను స్థాపించాలని సూచించారు. గాయని సునీతకు ప్రపంచ సంగీత రత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. గాయకుల ఆలాపన ముగ్థుల్ని చేసింది. కెటి హనుమంతు, రచయిత్రి భవానీ లోకేష్, డా. కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల భూములు
వక్ఫ్ పేరిట: అశోక్
శివాజీనగర: రాష్ట్రంలో రైతులు, ప్రైవేట్ వ్యక్తుల భూములను వక్ఫ్ ఆస్తులుగా నమోదు చేశారని కొన్ని నెలల కిందట తీవ్ర ఆందోళనలు జరగడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే గొడవ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో 1.80 లక్షలకు పైగా రైతుల భూరికార్డుల్లో వక్ఫ్ ఆస్తి అని మార్చారని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆరోపించారు. రైతుల భూమిపై గొడవలు రేకెత్తించే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి హితాన్ని కాపాడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రమంతటా రైతుల ఆర్‌టీసీ కాలమ్ 11లో వక్ఫ్‌కు చెందినది అని నమోదు చేయాల్సి ఉంటుందనే నివేదికలు బయటపడ్డాయి. ఇది లక్షలాది మంది రైతులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ రికార్డుల మార్పు రైతుల యాజమాన్యాన్ని కాలరాస్తుందని ఆవేదన చెందుతున్నారు. మొత్తం 3 లక్షల ఆర్‌టీసీలను వక్ఫ్‌లోకి మార్చే అవకాశముందని అశోక్ ఆరోపించారు.
అనుమానం పెనుభూతమై..
యశవంతపుర: భార్యపై అనుమానంతో నిత్యం వేధిస్తూ ఆమెను కత్తితో పొడిచి చంపిన భర్త ఉదంతమిది. బెళగావి జిల్లా అథణి తాలూకా కటగేరి గ్రామంలో జరిగింది. శోభా సారవాడ (35)ను అమె భర్త పరగొండ సారవాడ కత్తితో పొడిచి హత్య చేశాడు. వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లి కాగా, శోభా కటగేరిలోని ఔచికర మఠంలో విద్యార్థులకు వంటమనిషిగా పని చేసేది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన పరగొండ నిత్యం భార్యను అనుమానంతో వేధించేవాడు. శనివారం రాత్రి నిద్రలో ఉన్న శోభాను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆమె రక్తపు మడుగులో మరణించింది. నిందితున్ని అథణి పోలీసులు అరెస్టు చేశారు. తల్లి మృతితో పిల్లలు అనాథలయ్యారు.
రాష్ట్రంలో 13,675 మంది అక్రమ వలసదారులు
బనశంకరి: రాష్ట్ర హోంశాఖ అక్రమ వలసదారుల ఆచూకీ కనిపెట్టి జాబితా రూపొందించింది. కర్ణాటకలో 13,675 మంది అక్రమవలసదారులు ఉన్నట్లు తెలిపింది. బెంగళూరులోనే 10 వేలమందికి పైగా ఉన్నారు. మైసూరు, ఉత్తర కన్నడ, ఉడుపి, బెళగావి జిల్లాల్లో పెద్దసంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. మైసూరుకు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు వస్తున్నారని బీజేపీ నాయకులు ఆందోళనలు చేయడంతో అక్కడి రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు నిఘా వేశారు. పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేశారు. బెంగళూరు నగరంలో 10,650 మంది బంగ్లా వలసదారులు, బెళగావిలో 458 మంది, బళ్లారిలో 53, చామరాజనగరలో 3, చిక్కబళ్లాపురలో 38, చిత్రదుర్గలో 8, దక్షిణ కన్నడలో 268, దావణగెరెలో 20, హాసన్‌లో 5, హుబ్లీ, ధారవాడలో 35, కలబుర్గిలో 9, కోలారులో 13, కొడగులో 10, కొప్పళలో 10, మండ్యలో 37, మైసూరులో 810, రాయచూరులో 19, రామనగరలో 191 మంది బంగ్లాదేశీలు తిష్ట వేసినట్లు తేల్చారు. వారిని గుర్తించి వారి దేశానికి పంపిస్తామనని అధికారులు తెలిపారు.


