● మైసూరులో ఘరానా మోసం
మైసూరు: షేర్ల ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జార్ఖండ్‌కు చెందిన మోసగాని మాటలు నమ్మిన మైసూరు వ్యాపారి, తన పరిచయస్తులతో కలిసి రూ. 2.75 కోట్లు పోగొట్టుకున్నారు. వివరాలు.. జేపీ నగరకు చెందిన ఒక వ్యాపారికి గతేడాది జూలైలో జార్ఖండ్‌కు చెందిన గౌరవ్‌సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో పరిచయమయ్యాడు. తన ద్వారా షేర్ల వ్యాపారం చేయాలని, భారీగా లాభాలు వస్తాయని, ఏ క్షణంలోనైనా విత్‌డ్రా చేసుకోవచ్చని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆ వ్యాపారి, ఆగస్టు 2025లో దశలవారీగా అతను చెప్పిన ఖాతాలో రూ. 25 లక్షలు జమ చేశాడు. లాభాలు వచ్చినట్లు చూపిస్తూ నమ్మకాన్ని పెంచుకున్నాడు. దీంతో మరింత ఉత్సాహపడిన ఆ వ్యాపారవేత్త, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 6 మంది స్నేహితులతో రూ. 2 కోట్లు పెట్టుబడి పెట్టించాడు. ఈసారి ఒక్కసారి లాభం వచ్చింది, ఇదేమని వ్యాపారి ప్రశ్నించగా రాథోడ్ పట్టించుకోలేదు. అనుమానం వచ్చి వంచకుని గ్రామానికి వెళ్లి అతని గురించి విచారించాడు. వ్యాపారంలో డివిడెండ్ ఇస్తానని వాగ్దానం చేసి అతను చాలా మందిని కోట్లాది రూపాయలు మోసం చేశాడని గ్రామస్తులు చెప్పడంతో తానూ మునిగినట్లు తెలుసుకున్నాడు. మైసూరులోని విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సంఘ్‌పై హోంమంత్రి విమర్శలు
శివాజీనగర: ఆర్‌ఎస్‌ఎస్‌వారు రాజ్యాంగం మాట వినరు, అయితే పేజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామే ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ రిజిస్ట్రేషన్ కాలేదన్నారు అని హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఆయన మరోసారి సంఘ్‌పై విమర్శలు గుప్పించారు. ప్రపంచపు అతిపెద్ద సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ రిజిస్ట్రేషన్ కాలేదా అని అడగటం తప్పా? కార్యక్రమాలలో పెద్దసంఖ్యలో జనం పాల్గొంటూ ఉంటారు, అందుచేత రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పానన్నారు. వారి వద్ద ఫీజు డబ్బులు లేకుంటే తానే చెల్లిస్తానని ఎద్దేవా చేశారు.
బౌద్ధ క్షేత్రాలపై చిన్నచూపు తగదు
● అంబేడ్కర్ మనవడు భీంరావ్
మైసూరు: భారతదేశం బుద్ధుని జన్మభూమి అని ప్రపంచం ముందు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, బౌద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యత లభించడం లేదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మనవడు భీంరావ్ యశ్వంత్ అంబేడ్కర్ విచారం వ్యక్తం చేశారు. మైసూరు సిటీలో బల్లాల్ సర్కిల్ సమీపంలో ఉన్న విశ్వమైత్రి బుద్ధ విహారాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. బుద్ధ గయ, సారనాథ్, కుషి నగర్ వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలను లక్షలాది మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్నారని, ఇది దేశ పర్యాటక రంగానికి గణనీయమైన తోడ్పాటును అందిస్తోందని అన్నారు. కర్ణాటకలోని బీదర్, భాల్కి, కలబుర్గి వంటి సరిహద్దు ప్రాంతాల్లో బౌద్ధ ఉద్యమం బలంగా వృద్ధి చెందుతోందన్నారు. యాదగిరి జిల్లా సమీపంలోని సన్నతి ప్రాంతం అశోక చక్రవర్తి రెండవ రాజధాని అని, అక్కడి బౌద్ధ పురావస్తు సంపదను పరిరక్షించి, అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. బౌద్ధ విహారాలు కేవలం మత కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ధర్మ ప్రచారం, విద్య, నూతన తరానికి మార్గనిర్దేశం చేసే కేంద్రాలుగా కూడా మారాలని ఆయన అన్నారు.


