రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ గెలుస్తాం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ గెలుస్తాం

Jun 29 2026 1:35 AM | Updated on Jun 29 2026 1:35 AM

బనశంకరి: రాష్ట్రంలో 2028లో జరిగే శాసనసభ ఎన్నికల్లో, 2029లో దేశంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని, ఇందుకు దేశ కార్మికులు, ప్రజల మద్దతు ఉండాలని సీఎం డీకే.శివకుమార్‌ చెప్పారు. ఆదివారం నగరంలోని కాంగ్రెస్‌ ఆఫీసులో ఏఐటీయుసీ (ఇన్‌టెక్‌) సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఇంటెక్‌ ద్వారా దేశ శ్రామికులు, కార్మికుల బలం పెరిగిందని, కాంగ్రెస్‌లో ఇంటెక్‌ సభ్యులు ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ నెల 30 నుంచి రాష్ట్రంలో సర్‌ సమీక్ష ప్రారంభమౌతుందని, శ్రామికులు, కార్మికుల ఓట్లను బీజేపీ తొలగిస్తుందని ఆయన ఆరోపించారు. కాబట్టి కార్మికులు జాగ్రత్తగా ఉంటూ, ఓట్లు తీసేయకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇంటెక్‌ నేత సంజీవరెడ్డి కార్మిక సంఘాలకు అండగా ఉంటున్నారని అభినందించారు.

మత్తు కలిపితే పాన్‌, గుట్కా నిషేధం

శివాజీనగర: కొద్దిగా మత్తు పదార్థం కలిపినా కూడా రాష్ట్రంలో పాన్‌ మసాలా, గుట్కాల అమ్మకం నిషేధించనున్నట్లు సీఎం హెచ్చరించారు. ఆదివారం కంఠీరవ క్రీడామైదానంలో రాజీవ్‌గాంధీ ఆరోగ్య విజ్ఞానాల విశ్వవిద్యాలయం 31వ సంస్థాపనా దినాచరణ, మత్తువిముక్త భారత అభియాన్‌ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పాన్‌ మసాలా, గుట్కా, వక్క ప్యాకెట్లు తదితర ఉత్పత్తుల్లో మత్తు పదార్థాలను కలుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది, అలాంటి విక్రయాలను కర్ణాటకలో నిషేధిస్తామని తెలిపారు. డ్రగ్స్‌ విముక్త కర్ణాటక తమ లక్ష్యమన్నారు. ఇందుకు యువ వైద్యులు సహకరించాలన్నారు. వైద్య విద్య అందరికీ అందాలన్నారు, బెంగళూరు ఎయిర్‌ కండీషన్‌ నగరమని, ఇక్కడ ఉన్నన్ని ఆస్పత్రులు ఎక్కడా లేవని, కర్ణాటక దేశంలో వైద్య రాజధానిగా మారిందని తెలిపారు.

చుక్కల పంపిణీ

ఆరోగ్యకర కుటుంబంతో ఆరోగ్యకరమైన రాష్ట్ర, దేశ నిర్మాణం సాధ్యమని సీఎం అన్నారు. సదాశివనగర తన నివాసంలో శిశువులకు పోలియో చుక్కలు వేశారు. ఆరోగ్య మంత్రి ఖాదర్‌ పాల్గొన్నారు.

సీఎం డీకే శివకుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement