సాక్షి, బళ్లారి: వరుణుడి జాడ కనిపించడం లేదు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవక పోవడంతో తుంగభద్ర జలాశయంలో రోజు రోజుకు నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 50 టీఎంసీల నీరు ఇన్‌ఫ్లో వచ్చి చేరగా.. ప్రస్తుతం ఇన్‌ఫ్లో లేదు. గతేడాది ఈ సమయానికి డ్యాంలో 60 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రస్తుతం 9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో ఈ ఏడాది ఇన్‌ఫ్లో ప్రారంభం కాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. డ్యాం క్రస్ట్‌గేట్లు శిథిలావస్థకు చేరడంతో ఇటీవల 33 క్రస్ట్‌గేట్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి ప్రారంభించారు. అయితే వర్షాలు కురవకపోవడంతో డ్యాంలోకి నీరు చేరడం లేదు. దక్షిణ భారత దేశంలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, అనంతపురం, కర్నూలు. వైఎస్‌ఆర్ కడప జిల్లా, మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాలకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయమైన తుంగభద్ర డ్యాం నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నైరుతి రుతుపవనాల బలహీనత, ఎల్‌నీనో ప్రభావం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
ఆయకట్టు రైతుల నిరాశ
ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు ఎలా చేయాలో తెలియక ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు పరిధిలో లక్షలాది ఎకరాల్లో వరితో పాటు మిర్చి, మొక్కజొన్న, పత్తి కూడా సాగు చేస్తారు. కాలువలకు నీరు వదిలే లోపు దుక్కులు దున్ని, వరినారు సిద్ధం చేసుకోవడం సాధారణం. నీరు వదిలిన తర్వాత వారంలోపు వరినాట్లు వేయాలి. అయితే ఈ ఏడాది వరినారు మళ్లు కూడా పూర్తిస్థాయిలో వేయకపోవడంతో వరి సాగు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంత రైతాంగానికి ప్రధానంగా తుంగభద్ర డ్యాంలో నీరు వస్తేనే పంటలు సాగు చేసుకునేందుకు వీలవుతుంది. లేకపోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది.
ఉసూరుమనిపిస్తున్న మేఘాలు
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకూ డ్యాం ఎగువన ఆగుంబె, మోరాళ, తీర్థహళ్లి, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నప్పటికీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో దాదాపు 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో కూడా 60 వేల క్యూసెక్కులు రావడంతో జూలై రెండవ వారంలోనే డ్యాం పూర్తిగా నిండిపోయి గేట్లు కూడా ఎత్తేశారు. కాలువకు సకాలంలో నీరు కూడా వదిలారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం డ్యాంలో 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.
టీబీ డ్యాంలో తగ్గిపోతున్న జలాలు
గతేడాది ఈ సమయానికి 60 టీఎంసీల నీరు నిల్వ
ప్రస్తుత నిల్వ 9 టీఎంసీలే..
కనిపించని వరుణుడి జాడ
ఆందోళనలో రైతన్నలు


