రాయచూరు రూరల్: మొక్కలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం. గ్రామీణ, నగర ప్రాంతాల్లో విరివిగా మొక్కలు పెంచాలని వడిగేర ఎస్‌ఐ మహబూబ్ అలీ సూచించారు. డీడీయూ పాఠశాలలో నిరీక్ష జన్మదినం సందర్భంగ మొక్కలు నాటారు. భవిష్యత్తులో ఉష్ణోగ్రతల నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటి కాపాడుకోవాలన్నారు. పచ్చదనంతో వర్షాలు కూడా కురుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో నింగప్ప, మల్లణ్ణ, ఖండెప్ప, మహ్మద్, యోగీస్ గౌడ, రక్షిత, రెడ్డప్ప, మహంతేష్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు
ప్రోత్సాహం అవసరం
హొసపేటె: క్రీడా రంగంలో దివ్యాంగుల విజయాలు వెలకట్టలేనివి. దివ్యాంగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెగ్గిన మఠం పీఠాధిపతి వరసాద్యోజాట శివాచార్య స్వామి తెలిపారు. దివ్యాంగులకు చెందిన వివిధ సంస్థల ఆధ్వర్యంలో కర్ణాటక పారా సిట్టింగ్ క్రికెట్ సంఘం సహకారంతో ఆదివారం విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా స్టేడియంలో రాష్ట్ర స్థాయి పారా సిట్టింగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైన సౌకర్యాల ద్వారా క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకు కృషి చేయాలని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సర్వసాధారణం అన్నారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీకి గంగావతి, గదగ్, బాగళకోట, విజయపుర, హులుగుంద నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. కార్యక్రమంలో కర్ణాటక పారా సిట్టింగ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సిద్దారూఢ, ఫైల్వాన్ సోమశేఖర్, టీఏపీ ఎంఆర్‌ఓ ధనరాజ్, బీకే.ఇమ్రాన్ బాషా, డి.నాగరాజ్, మున్సిపల్ ఉద్యోగి మన్సూర్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై ఆరా
రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. గ్రామాల్లో మౌలిక సౌలభ్యాలు కల్పించాలని విధాన పరిషత్ సభ్యుడు బసవన గౌడ బాదర్లి అధికారులను ఆదేశించారు. ఆదివారం సింధనూర్ తాలుకా కార్యాలయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వినతిపత్రాలు స్వీకరించారు. మురికి కాలువల్లో పూడిక, చెత్తా చెదారం తొలగించాలని తెలిపారు. గుంతలు పడిన రహదారులకు మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు. అనంతరం 30 పడకల తల్లీబిడ్డల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.
కరువును ఎలా ఎదుర్కొంటారో?
హుబ్లీ: రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది. మరో వారంలో వర్షాలు పడకపోతే పూర్తిగా కరువు వచ్చినట్లే అని మాజీ సీఎం, ఎంపీ బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే జిల్లాధికారులతో సమావేశం జరిపి నివేదిక తీసుకుని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 70 శాతం ప్రాంతాల్లో విత్తు పడలేదని తెలిపారు. మరో వారం గడిస్తే తీరని దాహార్తి ఏర్పడుతుందన్నారు. ఇలాంటి స్థితిలో తక్షణమే అప్రమత్తం కావాల్సిన ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ప్రారంభంలోనే తప్పుటడుగు వేశారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో లేరు.. రెండు మూడు జిల్లాలకు ఒక ఇన్‌చార్జి మంత్రిని నియమిస్తే కరువు పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు. టీబీ డ్యామ్ క్రస్ట్ గేట్ల ప్రారంభానికి విచ్చేసిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై డీకే.శివకుమార్ చర్చించకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ
కోలారు: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ ఎం.ఎల్.అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని పాత్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నీట్ లీకేజీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలన్నారు. ఈ విషయంలో దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. గత 12 సంవత్సరాల అవధిలో నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ అవుతుండడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని తెలిపారు. విద్యార్థులు మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సమావేశంలో కోముల్ డైరెక్టర్ చంజిమలై రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మైలాండహళ్లి మురళి తదితరులు పాల్గొన్నారు.
నోటు పుస్తకాల పంపిణీ
కెలమంగలం: డెంకణీకోట సమీపంలోని ఓ గ్రామంలో బాలలకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. తళి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న వి ద లీడర్ సంస్థ ప్రతినిధులు ఆదివారం డెంకణీకోట తాలూకా సందనపల్లి గ్రామంలో పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను అందజేశారు. నరేష్‌కుమార్, ప్రభాకర్, యోగేష్‌రెడ్డి, సురేంద్రన్, ప్రశాంత్, సునిల్, శివ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
దళిత నేతకు నివాళులు
కోలారు: అనారోగ్యంతో మరణించిన దళిత యువ నాయకుడు యుగంధర్‌కు ఆదివారం నగరంలోని నచికేత నిలయంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత సంయుక్తరంగ జిల్లా అధ్యక్షుడు డిపిఎస్ ముని రాజు , జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మైలారప్ప, తాలూకా అధికారి గోపినాథ్, ప్రముఖులు పాల్గొన్నారు.


