రాయచూరు రూరల్: మాన్విలో మౌలిక సౌలభ్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అధికారి పూవిత పేర్కొన్నారు. ఆదివారం ప్రభుత్వ అస్పత్రి, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం నగర సభ కార్యాలయంలో జరిగిన సభలో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తాగు నీటి జలాశయం, వివిధ ప్రాంతాల్లో మురికి కాలువల్లో పూడిక, చెత్తా చెదారం తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. తల్లీబిడ్డల ప్రభుత్వాస్పత్రిని సందర్శించి రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తాలూకా విద్యాశాఖ అధికారి చంద్ర శేఖర్, ఆరోగ్య అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరిహారం
రాయచూరు రూరల్: గత నెలలో కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలుకా కరదాళ వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం బాధిత కుటుంబాలను రాష్ట్ర వైద్య శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ పరామర్శించారు. దేవరాజ్ అయ్యప్ప, మూడబూళ లక్ష్మికాంత, బీజనళ్లి నివాసి ప్రకాష్ బసప్ప కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మంజూరైన పరిహారం చెక్కులు అందజేశారు.
కూలిన పైకప్పు: ఇద్దరు మృతి
రాయచూరు రూరల్: దేవదుర్గ కొత్త బస్టాండ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో రవిచంద్ర (30), నాగరాజ్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ దత్తాత్రేయ ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనం పైకప్పు కూలడంతో మట్టిలో కురుకుపోయిన ఇద్దరు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. ఘటన స్థలాన్ని శాసన సభ్యురాలు కరియమ్మ నాయక్ పరిశలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
విద్యుత్ కోతలపై
రైతన్నల ఆగ్రహం
హుబ్లీ: విద్యుత్ కోతలపై కల్లేకాబా, కబ్బేనూర, హారొబెళవడి, మడకలకట్టికి చెందిన రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నిరసిస్తూ ఆదివారం తాలూకాలోని ఉప్పినబెటగేరిలో విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యుత్ కోతలతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు పరమేశ్వర, సుదీప్ గౌడ, జగదీశ్, మంజునాథ్, శాంతు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయన్నారు. గాలికి విద్యుత్ తీగలు తగులుకుని విద్యుత్ సరఫరా ఆగిపోతోందని తెలిపారు. 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఎస్కాం శాఖ అధికారి పనీంద్ర స్పందించారు. తక్షణం సమస్యలు పరిష్కరించి విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
మురుగు తొలగించరూ..
రాయచూరు రూరల్: మురుగు కాలువల్లో పేరుపోయిన చెత్త, మురుగు తొలగించాలని కొప్పళలో ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. నగర సభ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. గుంతలు పడిన రహదారులకు మరమ్మతులు చేయాలని కోరారు.


