హొసపేటె: మార్కెట్‌లో మల్లెపూల ధరలు పడిపోయాయి. ఆరుగాలం శ్రమించి పూలతోటలను కాపాడుకుంటున్న రైతులు లబోదిబోమంటున్నారు. ఇటీవల విజయనగర జిల్లా హగరిబోమ్మనహళ్లి తాలూకా బండి గ్రామానికి చెందిన రైతు మంజునాథ 2 ఎకరాల మల్లె తోటను గొర్రెలకు మేతగా వదిలేశాడు. దాదాపు 2 నెలల పాటు మల్లెపూల ధరలు పడిపోవడమే ప్రధాన కారణం. మార్కెట్‌లో మల్లె మొగ్గల ధర కిలో రూ.100 నుంచి రూ.120 వరకూ పలుకుతున్నాయి. తోటలో మల్లె మొగ్గలు తెంపేందుకు కూలీలకు ఒక్కరికి రూ.300 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కనీసం కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కాకపోవడంతో పూలతోటను అలాగే వదిలేస్తున్నారు. అప్పులు చేసి పూలతోటలు సాగు చేస్తున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుని పోతున్నారు.


