ప్రియుని చేతిలో వివాహిత హత్య | - | Sakshi
Sakshi News home page

ప్రియుని చేతిలో వివాహిత హత్య

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

యశవంతపుర: దారి తప్పిన ప్రేమ విషాదాంతమైంది. వివాహిత మహిళతో ప్రేమాయణం నడిపి, ఆమెతో పరారైన వ్యక్తి.. చివరికి ఆమెను హతమార్చాడు. ఈ ఘోర సంఘటన బెంగళూరు నగర జిల్లా ఆనేకల్‌ తాలూకా జిగణిలో జరిగింది. బాగల్‌కోట జిల్లా ఇళకల్‌కు చెందిన అక్షత (30)ను ఆమె ప్రియుడు నానా సాహెబ్‌ బలిగొన్నాడు. ఈ నెల 20న జిగణి పటాలమ్మ లేఔట్‌లోని ఇంటిలో దుర్వాసన వచ్చింది. ఇంటి యజమాని కిటికిలోంచి చూడగా అక్షత శవం కనిపించగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్లు రిపోర్టులో తెలిపారు.

బాడుగ ఇల్లు తీసుకుని..

2014లో అక్షత, కృష్ణ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కూతురు, కొడుకు ఉన్నారు. భర్త కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఆమెకు చేనేత కార్మికుడు నానా సాహెబ్‌తో పరిచయమై అనైతిక సంబంధం ఏర్పడింది. ఇతడు అవివాహితుడు అని సమాచారం. అతని మోజులో పడిన అక్షత భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఇటీవల ప్రియునితో కలిసి ఇళకల్‌ నుంచి బెంగళూరుకు వచ్చేసింది. తామిద్దం భార్యాభర్తలమని చెప్పి బాడుగ ఇంటిలో చేరారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నానాసాహెబ్‌ ఆమెను చంపి ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయాడు. హంతకుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

భర్త, పిల్లలను వదిలేసి వచ్చిన హతురాలు

బెంగళూరు జిగణిలో దారుణం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement