శివాజీనగర: రైతుల సమక్షంలో బిడది టౌన్‌షిప్ ప్రాజెక్ట్‌పై చర్చిద్దామని పట్టుబడుతూ కేంద్ర భారీ పరి శ్రమలు, ఉక్కు కర్మాగారాల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి స్థానిక బైరమంగలలో రైతులతో సమావేశం నిర్వహించారు. సీఎం డీకే శివకుమార్ ఈ సభకు వచ్చి తనతో చర్చకు రావాలని కుమార సవాల్ చేశారు. సీఎం కోసం వేదికపై ఒక కుర్చీని ఖాళీ ఉంచారు. కుమారస్వామి రైతుల మాదిరిగా గ్రీన్ శాలువా వేసుకొని కూర్చున్నారు. సీఎం శివ కెంపేగౌడ జయంతి సహా అనేక కార్యక్రమాల్లో బిజీగా గడిపారు.
సీఎం ఎక్కడికి పిలిచినా వస్తాను: కుమార
కుమారస్వామి మాట్లాడుతూ బిడది గురించి తనకు ఎలాంటి భేషజం లేదు, ఎక్కడికి చర్చకు పిలిచినా రైతులను పిలుచుకొని వెళతానని చెప్పారు. బైరమంగలకు చర్చకు రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికానని తెలిపారు. అయితే ఆయన ఇక్కడకి రాడని తెలిసిందన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కృష్ణాలో భేటీ ఉందన్నా రైతులతో హాజరవుతానన్నారు. రైతుల మధ్యలోనే చర్చ జరిగి తీర్మానం చేయాలన్నారు. 2007లోనే రైతుల వ్యతిరేకత వల్ల బిడది ప్రాజెక్ట్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. గత 470 రోజులకుపైగా టౌన్‌షిప్‌కు భూముల స్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ధర్నా చేస్తున్నారు, 80 శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. అందువల్ల ఈ పథకాన్ని కొనసాగించాలా, వద్దా అనేది రైతుల మధ్యలోనే నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం తనకు జూన్ 26న విధానసౌధలో చర్చకు పిలిచారు, ఆరోజు కార్యక్రమాలు ఉండడం వల్ల సాధ్యపడలేదు, ఇప్పుడు భైరమంగళలో ఉన్నానని, సీఎం రాకపోతే అధికారులనైనా పంపించాలని కుమార కోరారు.
అనుకూల, వ్యతిరేక వర్గాలు
మరోవైపు టౌన్‌షిప్ అనుకూల, వ్యతిరేక ధర్నాలతో బైరమంగలలో కోలాహలం నెలకొంది. భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటైంది. కుమారస్వామి బైరమంగలకు రాకముందే అనుకూల–వ్యతిరేక వర్గాలు నినాదాలతో హోరెత్తించారు. కుమారస్వామి రాగానే కొందరు రైతులు ఆకుపచ్చ జెండాలు ఊపారు, కొందరు ఎర్రజెండాలతో వ్యతిరేకత తెలిపారు. తక్షణం భూ పరిహార ధనం ఇవ్వాలని అనుకూల రైతులు డిమాండ్ చేశారు. ఈ పథకం వద్దంటూ మరోవర్గం రైతులు నినాదాలు సాగించారు. సభలో పెద్దసంఖ్యలో జేడీఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ
కమిటీ నివేదిక
శివాజీనగర: ఇటీవల జరిగిన విధానపరిషత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేశారని ఆరోపణలపై ఎమ్మెల్సీ సీ.టీ.రవి నేతృత్వంలో సత్యశోధనా కమిటీ విచారణ జరిపి శనివారం నివేదికను సమర్పించింది. క్రాస్ ఓటింగ్ చేసినవారిని కనిపెట్టేందుకు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మూడు పేజీల నివేదికను సీల్డ్ కవర్‌లో ఇచ్చారు. మిత్రపక్షం జేడీఎస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసినట్లు, అందులో ఒక ఓటు రద్దు అయిందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను చూచాయగా పేర్కొన్నట్లు సమాచారం. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ నివేదికను ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌కు పంపిస్తారు. గత మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను విజయేంద్ర, ఆర్.అశోక్ కలిసి క్రాస్ ఓటింగ్‌పై వివరించారు. అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని నబిన్ తెలిపారు. సీటీ రవి మాట్లాడుతూ అనుమానస్పద ఎమ్మెల్యేల వివరాలు, అభ్యర్థులతో చర్చించి సేకరించిన సమాచారంతో నివేదికను తయారు చేశామన్నారు.
బెంగళూరు సమీపంలో బిడది వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న టౌన్‌షిప్ రాజకీయంగా సెగలు రేపుతోంది. రైతుల భూములను లాక్కునే ఈ పథకం వద్దేవద్దని కేంద్రమంత్రి కుమారస్వామి కొన్నివారాలుగా పట్టుబడుతున్నారు. చర్చకు ఎక్కడైనా రెడీ అని కుమార, సీఎం డీకే శివకుమార్ సవాళ్లు విసురుకుంటున్నారు.
వేడెక్కిన టౌన్‌షిప్ పథకం
రైతులతో కేంద్ర మంత్రి
కుమారస్వామి సభ
సీఎం శివ చర్చకు రావాలని సవాల్
పథకానికి రైతులు వ్యతిరేకమన్న కుమార


