శనీశ్వరాయ నమః | - | Sakshi
Sakshi News home page

శనీశ్వరాయ నమః

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

కోలారు: ముళబాగిలు తాలూకాలోని ఖాద్రిపుర సర్కిల్‌లో ఉన్న శనీశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి విశేష పూజా వేడుకలను నిర్వహించారు. ఉదయం స్వామి వారికి తైలాభిషేకం, పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, పుష్పా లంకరణ, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని బాధలు, కష్టాలను తొలగించాలని పూజలు చేశారు.

షెడ్డులో రూ.2.98 కోట్లు సీజ్‌

బనశంకరి: బెంగళూరులోని కురబరహళ్లి పరిధిలోని ఓ ఫ్యాక్టరీలో దాచిపెట్టిన రూ.2.98 కోట్ల నగదును మహాలక్ష్మీ లేఔట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తావరకెరె నివాసి నాగరాజ్‌ భారీ మొత్తంలో నగదును తన స్నేహితుడు వెంకటేశ్‌కు చెందిన శేషాద్రి ఇండస్ట్రీస్‌ పేరుతో ఉన్న షెడ్‌లో ఈ డబ్బును దాచి ఉంచారు. ఇది తెలిసి పోలీసులు సోదాలు చేయగా, నాలుగు పెద్ద బ్యాగుల్లో నింపిన కరెన్సీ కట్టలు లభించాయి. పోలీసులు లెక్కించగా మొత్తం రూ.2.98 కోట్లు అని తేలింది. పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించి, కేసు నమోదు చేశారు. నాగరాజ్‌, వెంకటేశ్‌ని విచారించగా, చిత్రదుర్గలో ఉన్న మా ఆస్తిని విక్రయించి నగదు తీసుకువచ్చామని తెలిపారు. బ్యాంకులో ఉన్న అప్పు తీర్చడానికి నగదు దాచామన్నారు. ఈ కేసులో వారికి కోర్టులో బెయిలు వచ్చింది. అయితే నగదుకు ఆధారాలు లేవంటూ పోలీసులు, ఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

చిక్కమగళూరుకు టూరిస్టుల వెల్లువ

యశవంతపుర: మూడు రోజుల పాటు సెలవులు రావడంతో చిక్కమగళూరు జిల్లావ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ముళ్లయ్యనగిరి, దత్తపీఠం, గాళికెరెగె సహా అనేక ప్రదేశాల్లో కార్లు, జనంతో నిండిపోయాయి. ముళ్లయ్యనగిరి ప్రాంతానికి ఒక్కసారిగా జనం రావడంతో కొండపై నుంచి కింది వరకూ వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. పండరవళ్లి సీతాలయ్యనగిరి వద్ద రద్దీ వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గంటల కొద్దీ వాహనాలు రోడ్డుపై నిలిచి పోయాయి. పర్యాటకులు నానా అవస్థలు పడ్డారు. స్థానిక ఉద్యోగులు ఒక్కోకారు నుంచి రూ.వెయ్యి, 15 వందలు ముడుపులు వసూలు చేసి కొండపైకి వదలడంతో విపరీతమైన రద్దీ నెలకొందని ఆరోపణలు వచ్చాయి.

గొలుసు దొరికి.. గొడవలు

నలుగురికి తీవ్రగాయాలు

శివమొగ్గ: నగరంలోని రాజీవ్‌ గాంధీ లేఔట్‌లో దొరికిన బంగారు గొలుసు కోసం కొందరు యువకులు గర్భిణీతో సహా నలుగురిపై కత్తులు, రాడ్లతో దాడి చేశారు. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తికి బంగారు గొలుసు దొరికింది. దీంతో ఆనోటా ఈనోటా ప్రచారమైంది. అది తమదేనని, ఇవ్వాలని కొందరు యువకులు అతనిని ఒత్తిడి చేయగా ఘర్షణ మొదలైంది. అతని ఇంట్లోకి దూరి కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు ఆరోపించారు. హసీనా (27), గర్భిణి ఉజ్మా (21), సల్మా (35), సయ్యద్‌ షేరు (25) అనేవారికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం మొగ్గాన్‌ ఆసుపత్రిలో చేర్చారు. అబ్బు, యాసిన్‌ల బృందమే ఈ దాడి చేసిందని ఆరోపిస్తూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నా క్యాబ్‌లో బీరు తాగొద్దు..

మహిళపై డ్రైవరు దాడి

యశవంతపుర: క్యాబ్‌లో ప్రయాణికురాలు జ్యూస్‌ తాగుతుండగా, బీరు తాగుతున్నావంటూ డ్రైవరు ఆమెతో గొడవకు దిగాడు. ఈ ఘటన బెంగళూరు అశోక్‌నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ నెల 21న రాత్రి మహిళ కోరమంగళ రెస్టారెంట్‌ నుంచి తన ఇంటికి ఉబర్‌ కారును బుక్‌ చేసుకొంది. కారు ఎక్కగానే జ్యూస్‌ బాటిల్‌ తీసి తాగుతుండగా, కారులో బీరు తాగవద్దంటూ డ్రైవరు ఆమెను దబాయించాడు. ఇది బీరు కాదు, జ్యూస్‌ అని చెప్పినా అతడు వినిపించుకోలేదు. కారులో నుంచి బయటకు తోసేందుకు ప్రయత్నించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు వచ్చిన ఫిర్యాదులో తెలిపింది. డ్రైవర్‌ దౌర్జన్యంగా మాట్లాడటంతో మహిళ కారును, నిలిపి తన ట్రిప్‌ను రద్దు చేయాలని పదేపదే కోరింది. అయినా కారును నిలపకపోవడంతో అతికష్టం మీద డోర్‌ను తెరిచి కిందకు దూకేసింది. డ్రైవర్‌ కారుతో వెళ్లిపోయాడని తెలిపింది. పోలీసులు డ్రైవరు కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement