మైసూరు: చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలూకాలోని బండీపుర పులి అభయారణ్యంలో చిరకనహళ్లి గ్రామ శివార్లలో బోనులో 9 ఏళ్ల ఆడ పులి బందీ అయ్యింది. కొన్నిరోజులుగా గ్రామం చుట్టుపక్కల సంచరిస్తూ ఉంది. ఒక ఆవును వేటాడి చంపింది. ప్రజలు అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేయగా, ఓ పొలంలో బోనును ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి పులి ఆ బోనులోకి చిక్కడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ సిబ్బంది పులిని తరలించారు.
చిరుత పట్టివేత
మైసూరు: చామరాజనర జిల్లాలోని హొన్నహళ్లి సమీపంలో పశువులపై దాడి చేస్తూ, రైతులను భయాందోళనలకు గురిచేస్తున్న ఒక చిరుతను నిర్బంధించారు. 5 ఏళ్ల మగ చిరుత గత కొన్ని రోజులుగా గ్రామాల్లోకి వస్తూ పశువులపై దాడి చేస్తోంది. బీఆర్ పులి అభయారణ్యం అటవీ సిబ్బంది పరిసర ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేయగా, ఓ బోనులోకి అది పడింది. దానిని దట్టమైన అడవిలోకి వదిలివేస్తామని అటవీ అధికారులు తెలిపారు.
బార్ బుగ్గి కేసులో..
అబ్కారీ డీసీ సస్పెండ్
మైసూరు: నగరంలోని దత్త గల్లిలో ఉన్న ఫాక్స్ డెన్ బార్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది సజీవ దహనం కాగా, 10 మంది వరకూ గాయపడడం తెలిసిందే. ఈ ఘటనలో ప్రభుత్వం చర్యలను చేపట్టింది. మైసూరు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) నాగరాజప్పను సస్పెండ్ చేసింది. ఇదివరకే ఎకై ్సజ్ శాఖకు చెందిన కొందరు సిబ్బందిని, మైసూరు పాలికేలో కొందరు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయితే, ఎకై ్సజ్ డీసీ నాగరాజప్పపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం ప్రజలు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి యతీంద్ర అప్పట్లో ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. యతీంద్ర సిఫార్సుతో డీసీపై వేటు పడింది. ఉన్నతాధికారులు చాలా రోజులుగా డీసీపై ఉదాసీనంగా ఉన్నప్పటికీ, చివరకు మంత్రి సూచన, కేసు తీవ్రత వల్ల నాగరాజప్పను సస్పెండ్ చేయడం గమనార్హం. అలాగే అగ్నిమాపక శాఖలోని ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘోర అగ్నిప్రమాదానికి దారితీసిన అధికారుల లోపాలు, నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
బాలలకు చుక్కల భరోసా
● నేటి నుంచి పల్స్ పోలియో
శివాజీనగర: బెంగళూరు నగరంతో సహా నేడు రాష్ట్రమంతటా పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ జరుగుతుంది. ఆదివారం నుంచి జూలై 1 వరకు 5 ఏళ్ల లోపు బాలలకు చుక్కల మందు ఇస్తారు. జీబీఏ పరిధిలోని వార్డుల్లో ఆరోగ్య కేంద్రాలు, నమ్మ క్లినిక్‌లు, డెలివరీ ఆసుపత్రులు, కుటుంబ సంక్షేమ కేంద్రాలు, అంగనవాడీలు, పాఠశాలల్లో పోలియో బూత్‌లు ఏర్పాటు చేస్తారు. అలాగే బస్టాండ్లు, మెట్రో, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్, మాల్‌లు, ప్రైవేట్ ఆసుపత్రులు, మురికివాడల్లాంటి రద్దీ ఉన్న స్థలాల్లో స్థిర, సంచార ఆరోగ్య బృందాలు చుక్కల మందును పంపిణీ చేస్తాయి. ఐదేళ్ల లోపు పిల్లలకు గతంలో ఎన్నిసార్లు పోలియో చుక్కలు వేసినా ఈసారి కూడా ఇప్పించాలని వైద్యాధికారులు తెలిపారు. గ్రేటర్ బెంగళూరు పరిధిలో 1.23 కోట్ల జనసంఖ్య ఉంది. 5 సంవత్సరాల లోపు 11.47 లక్షల మంది బాలలు ఉన్నారు. వారి కోసం 3,444 పోలియో బూత్‌లు, 15 వేల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు చుక్కల మందు పంపిణీలో పాల్గొంటారు. పోలియో విముక్త ప్రపంచ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని జీబీఏ విన్నవించింది. ఇదే మాదిరిగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలలో చుక్కల మందు పంపిణీ జరుగుతుంది.
ఉప రాష్ట్రపతి రాక
సాక్షి, బెంగళూరు: ఉప రాష్ట్రపతి సీసీ రాధాకృష్ణన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరుకు వచ్చారు. కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, మంత్రి ఖాదర్ ఆయనకు ఘన ఆహ్వానం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షాలిని రజనీశ్, డీజీపీ డాక్టర్ సలీం అహ్మద్ తదితరులు ఉన్నారు. బెంగళూరులో జరిగే వివిధ అధికారిక కార్యక్రమాల్లో రాధాకృష్ణన్ పాల్గొననున్నారు.


