శివమొగ్గ: గుండెపోటు ఘటనలు దడ పుట్టిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆకస్మికంగా తనువు చాలిస్తున్నారు. ఇదే మాదిరిగా శివమొగ్గ జిల్లాలోని హోసనగర తాలూకాలో ఉన్న ప్రసిద్ధ కొడచాద్రి పర్వతాల ట్రెక్కింగ్‌కు వెళ్లిన బెంగళూరుకు చెందిన ఉల్లాస్‌గౌడ (28) అనే యువకుడు గుండెపోటు వచ్చి మరణించాడు. మృతుడు ప్రముఖ సినీ నిర్మాత బి.ఎం. హరీష్ కుమారుడు. శివమొగ్గ జిల్లాలో కొడచాద్రి కొండలు ప్రకృతి సౌందర్యానికి, పర్వతారోహణకుపేరు గాంచాయి. ఉల్లాస్‌గౌడ స్నేహితులతో కలిసి మొత్తం 13 మంది బెంగళూరు నుంచి టెంపో ట్రావెలర్‌లో వచ్చారు. కొడచాద్రికి వచ్చి, అక్కడి సర్వజ్ఞ కొండను ఎక్కి తిరిగి వస్తుండగా ఉల్లాస్‌కు ఎదలో నొప్పి వచ్చింది. కుప్పకూలిపోవడంతో, అతడిని కొండ పైనుంచి కిందకు తీసుకొచ్చి వాహనంలో హొసనగర తాలూకా ఆసుపత్రికి తీసుకువెళుతుండగా దారిలోనే ఊపిరి వదిలాడు. దీంతో అప్పటివరకు సంతోషంగా సాగిన టూర్ విషాదయమైంది. ఉల్లాస్‌గౌడకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి జరగాల్సి ఉందని తెలిసింది.


