బళ్లారి అర్బన్: నగరంలోని లారీ టెర్మినల్ సమీపంలోని బెంగళూరు రోడ్డుపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నంద్యాల జిల్లా మర్కాపూర్ ప్రాంతానికి చెందిన టైలర్ రామమోహన్ రెడ్డి బళ్లారిలోని గుగ్గిరిహట్టిలో స్థిరపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న రామమోహన్ రెడ్డి రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు కింద పడిపోయాడు. ప్రమాదాన్ని నివారించేందుకు బస్సు డ్రైవర్ ఎంత ప్రయత్నించిన ఫలితం లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో టైలర్ రామమోహన్ రెడ్డి (31) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు.


