విషాదం మిగిల్చిన మంత్రాలయం యాత్ర | - | Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన మంత్రాలయం యాత్ర

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

సాక్షి, బళ్లారి: కుటుంబ సభ్యులంతా కలసి మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు సంతోషంగా బయలుదేరారు. అయితే మంత్రాలయం యాత్ర తీరని విషాదం మిగిల్చింది. కొప్పళ జిల్లా బానాపూర్‌ సమీపంలోని కుకునూరు తాలూకాలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులను హావేరి జిల్లా రట్టిహళ్లి తాలూకా కబ్బార్‌ గ్రామానికి చెందిన ప్రవీణ్‌ శివాజీ బాలేకాయి (40), కెంచమ్మ బాలేకాయి (34), చిన్నయ్‌ (18), రమేష్‌ బళ్లారి (45), అమృత కోట్యాల్‌ (25) గా గుర్తించారు. కబ్బార్‌ గ్రామానికి చెందిన 11 మంది ఓమ్నీ వ్యాన్‌లో మంత్రాలయం బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున కొప్పళ జిల్లా బానాపూర్‌ సమీపంలోని కుకునూరు తాలూకాలో జాతీయ రహదారిపై ఓమ్నీ వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో కొప్పళ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలు కావడంతో వారికి కొప్పళ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కొప్పళ జిల్లా ఎస్పీ రామ్‌ ఎల్‌ అరసిద్ధి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంతో కబ్బార్‌ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.

సంతాపం..

ఈ ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బసవరాజ్‌ బొమ్మై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని సోషల్‌ మీడియాలో సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు తక్షణం పరిహారం ప్రకటించాలన్నారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రమాద వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

రహదారిపై అడ్డంగా పడిపోయిన వాహనాలు

ఓమ్నీ వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ

ఐదుగురు మృతి, మరో ఆరుగురికి గాయాలు

కొప్పళ్ల జిల్లా బానాపూర్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఘటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement