ఘనంగా తిమ్మప్ప ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా తిమ్మప్ప ఉత్సవాలు

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

రాయచూరు రూరల్‌: బోళమాను దొడ్డిలో వెలసిన బోళ బండి తిమ్మప్ప స్వామి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత కృష్ణా నది నుంచి గంగా జలం తీసుకొచ్చి అభిషేకం, పుష్పాలంకరణ చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తిమ్మప్ప ఆలయంలో విశేష పూజలు చేశారు. తెల్లవారుజామున తొట్టెల సేవ నిర్వహించారు. మాజీ మంత్రి బోసురాజ్‌ తిమ్మప్ప స్వామని దర్శించుకుని పూజలు చేయించారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌, గోవిందు, నరసణ్ణ, అయ్యాళప్ప, ఆంజనేయ, హన్మంతు, రాజు, జంబన్న, నరసింహులు, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

సీహెచ్‌ పౌడర్‌ స్వాధీనం

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన క్లోరో హైడ్రేట్‌ పౌడర్‌ను ఎకై ్సజ్‌ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయచూరు, కలబుర్గి జిల్లాల్లో ఈ పదార్థం అధికంగా వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి, భారీగా సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా 771 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 5 గ్రాముల క్లోరో హైడ్రేట్‌ పౌడర్‌ను 5 లీటర్ల నీటిలో కలిపి తయారు చేసిన విషపూరిత మిశ్రమాన్ని సేవించడం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. దీనిని వినియోగించడం వల్ల శరీర అవయవాలు దెబ్బతినడం, పక్షవాతం, మూత్రపిండాలు (కిడ్నీలు) దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాయచూర్‌, చిత్రదుర్గ, చిక్కబళ్లాపూర్‌, తుమకూరు జిల్లాల్లో కూడా ఈ మత్తు పదార్థం విస్తతంగా వ్యాపించినట్లు సమాచారం.

పంట నష్ట పరిహారం ఇవ్వాలి

రాయచూరు రూరల్‌: ఖరీఫ్‌ సీజన్‌లో ముందుగా కురిసిన వర్షాలకు సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం వెంటనే పంట నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. శనివారం గదగ్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతు సంఘం అధ్యక్షుడు రామన గౌడ మాట్లాడుతూ.. ఉత్తర, కళ్యాణ కర్ణాటక ప్రాంతాల్లో రైతులు అప్పులపాలవుతున్నారని తెలిపారు. తీవ్ర వర్షాభావంతో సాగు చేసిన శనగ, పెసలు, జొన్న, పత్తి, పొద్దు తిరుగుడు, కంది తదితర పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. భజనలు చేస్తూ ఆందోళన కొనసాగించారు.

ఆదర్శప్రాయుడు కెంపేగౌడ

రాయచూరు రూరల్‌: పండితసిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో శనివారం జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగర సభ, సాంఘిక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆద్వర్యంలో కేంపేగౌడ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెంపేగౌడ చిత్రపటానికి ఏసీ హంపణ్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బెంగుళూరు నగర శిల్పి అయిన కెంపేగౌడ ఎంతో దూరదృష్టితో బెంగుళూరు నగరాన్ని నిర్మించారన్నారు. బెంగుళూరు నగరం ఉన్నంత కాలం కెంపేగౌడర పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ కుమార స్వామి, తహసీల్దార్‌ సురేష్‌, సీతా కులకర్ణి, దండెప్ప బిరదార్‌, కన్నడ అధికారి వీరేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

భారీగా గంజాయి పట్టివేత

బళ్లారి అర్బన్‌: హరగినడోణి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సూర్యకాంత ఎన్విరాన్‌మెంట్‌ టెక్నాలజీ, జైవిక ఆసత్రి వద్ద నిర్వహించిన దాడిలో రూ.6.68 లక్షల విలువైన 15.740 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్‌ సుమన్‌ డి.పన్నేకర్‌ తెలిపారు. నిందితులపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. హరగినడోణి పోలీస్‌ సిబ్బంది, ఎన్‌డీపీఎస్‌ నోడల్‌ అధికారులు, డీఎస్పీలు, జిల్లా ప్రత్యేక పోలీస్‌ బృందం సంయుక్తంగా ఈ దాడిలో పాల్గొన్నారు.

పశుగ్రాసం సమస్య తప్పదు

మొహర్రం వేడుకల్లో జోతిష్యం

రాయచూరు రూరల్‌: భవిష్యత్తులో తీవ్ర వర్షాభావ సమస్యలు వస్తాయి. పశుగ్రాసం సమస్య తలెత్తుతుంది. ఆహారానికి ఇబ్బందులు పడే దుస్థితి వస్తుంది’ అని మొహర్రం వేడుకల్లో ఒకరు జోతిష్యం చెప్పారు. శుక్రవారం బాగల్‌ కోట జిల్లా హెబ్బల్లి లాలాసాబ్‌ దర్గాలో ఓ వ్యక్తి భవిష్యత్తులో జరిగే సంఘటలను చెప్పుకొచ్చారు. కర్మలతో కూడిన వానలు అంటే ఒక చోట కురిసిన వర్షం.. మరో చోట పడదు. గాలీవానలతో పంటలు నాశనం అవుతాయన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement