60 శాతం భూమి ఇవ్వాల్సిందే | - | Sakshi
Sakshi News home page

60 శాతం భూమి ఇవ్వాల్సిందే

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

బళ్లారి టౌన్‌: కుడితినిలో పరిశ్రమలకు వాడుకోగా మిగిలిన భూమిని అభివృద్ధి చేయాలి. అందులో 60 శాతం భూమిని భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాలని కుడితిని భూమి కోల్పోయిన పోరాట సమితి నేత బసవరాజ్‌ తెలిపారు. శనివారం నేతలు సత్యబాబు తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చాలా కాలంగా తాము చేస్తున్న పోరాటాలకు కొద్ది వరకు ప్రభుత్వం నుంచి స్పందన లభించిందన్నారు. అయితే ఎకరాకు 1000 చదరపు అడుగులు భూమిని ఇస్తామని చెప్పడం సరికాదని మండిపడ్డారు. అభివృద్ధి పరచిన భూముల్లో 60 శాతం రైతులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించక పోతే బెంగళూరు ఫ్రీడం పార్కులో ఆందోళన చేస్తామని వెల్లడించారు. సమావేశంలో జంగ్లిసాబ్‌, బసవన గౌడ, గోపి, తిప్పయ్య పాల్గొన్నారు.

మత్తు పదార్థాలు హానికరం

హొసపేటె: తాలూకా ఆరోగ్య శాఖ, శ్రీ రాఘవేంద్ర పారా మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో శనివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. సివిల్‌ జడ్జి హెడ్‌ జే.శిల్ప మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్‌, మద్యం చట్ట విరుద్దమైనవిగా వర్గీకరించ బడిన వాటితో సహా ఇతర మత్తు పదార్థాల వినియోగం హానికరం అని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని సూచించారు. తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్‌.ఎస్‌.పీ.ప్రదీప్‌ మాట్లాడుతూ.. దూమపానం కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీయడమే కాకుండా ప్రాణాలను హరిస్తుందని తెలిపారు. యువత మత్తుకు బానిస కాకుండా ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ ప్రభు వినాయక్‌, పారా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హోన్నూరప్ప, కార్యదర్శి డి.హెచ్‌.దురుగేశ గణేశ్‌ పాల్గొన్నారు.

గదగ్‌ మఠంలో

తారాస్థాయికి విభేదాలు

సాక్షి, బళ్లారి: ఉత్తర కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన గదగ్‌ వీరేశ్వర పుణ్యాశ్రమంలో పీఠాధిపతి కల్లయ్య అజ్జా స్వామి, ట్రస్టీల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఒకప్పుడు ధార్మిక, సేవా కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన ఈ మఠంలో ప్రస్తుతం నెలకొన్న విభేదాలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దివంగత పుట్టరాజు గవాయి స్వామి ఆశ్రమాన్ని అభివృద్ధి చేసి ఉత్తర కర్ణాటకలో విశిష్ట స్థానం కల్పించారు. ఆయన శివైక్యం అనంతరం కల్లయ్య అజ్జా స్వామి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇటీవల మఠం నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై పీఠాధిపతి, ట్రస్టీల మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి. ముగ్గురు ట్రస్టీలు తనను వేధిస్తున్నారని కల్లయ్య అజ్జా స్వామి ఆరోపించారు. మొదట్లో మఠానికి రూ.59 లక్షల అప్పు ఉండేదని.. భక్తుల సహకారంతో ప్రస్తుతం రూ.4 కోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేశామన్నారు. తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. ట్రస్టీలు ప్రకాశ్‌, వసంతగౌడ, శివరుద్రప్ప స్వామిజీ ఆరోపణలను ఖండించారు. తాము 40 ఏళ్లుగా మఠానికి సేవలందిస్తున్నామని తెలిపారు. మఠం కోసం విరాళాలు అందజేశామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement