సాక్షి, బళ్లారి: రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి.. ప్రతి విషయంలోను తనదే జరగాలని పట్టుబట్టడం సరికాదని కేంద్ర మంత్రి సోమణ్ణ హితవు పలికారు. శనివారం దావణగెరె నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన విషయంపై హైకమాండ్ పరిశీలన చేస్తోందన్నారు. సాధక, బాధకాలపై దృష్టి సారించారన్నారు. సీటీ.రవి నేతృత్వంలో సత్యశోధన కమిటీ నియమించి విచారిస్తున్నట్లు తెలిపారు. క్రాస్ ఓటింగ్ చేసిన వారిని గుర్తించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. బిడిది టౌన్ షిప్‌కు సంబంధించిన భూముల అంశంపై అనవసరంగా రాజకీయాలు చేయవద్దని సూచించారు. బిడిది టౌన్‌షిప్‌కు సంబంధించిన భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని.. వాటిని ఒకే దశలో కాకుండా అవసరాన్ని బట్టి దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి కుమారస్వామి ముందుగా టౌన్‌షిప్ చేయాలని చెప్పిన మాట నిజమని.. ఆ తర్వాత రద్దు చేసినట్లు గుర్తు చేశారు.


