ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు
సాక్షి, బళ్లారి: ఆధ్యాత్మిక యాత్ర విషాదాంతమైంది. ఇష్టదైవాన్ని దర్శించుకుని మొక్కు తీర్చుకుందామని శుక్రవారం ట్రాక్టర్‌లో ఒకే కుటుంబానికి చెందిన వారు తమ బంధువులతో కలిసి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ మార్గమధ్యంలో తుంగభద్ర నది వంతెనపై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ లారీ ఢీకొంది. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి వంతెన పైనుంచి కిందకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ విషాద ఘటన గ్రామస్తులను కలిచి వేసింది. కొప్పళ జిల్లా మునిరాబాద్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. వివరాలు.. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా మర్లాయనహళ్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు, సండూరు తాలూకా యశ్వంతనగర గ్రామానికి చెందిన బంధువులతో కలిసి మొత్తం 19 మంది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, కొప్పళ జిల్లా హులిగిలో వెలసిన హులిగమ్మ దేవి ఆలయానికి ట్రాక్టర్‌లో బయలుదేరారు. అయితే వారు వెళుతున్న ట్రాక్టర్ మార్గమధ్యంలో వంతెనపై వెళుతుండగా కొప్పళ వైపునకు వేగంగా వెళుతున్న ట్యాంకర్ లారీ అదుపు తప్పి ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొంది. లారీ క్యాబిన్ ధ్వంసం కాగా ట్రాక్టర్ కిందకు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో డ్రైవర్‌తో సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులు వీరే
సండూరు, కూడ్లిగి తాలూకాలకు చెందిన గౌరమ్మ (25), గీత (20), మహంతేష్ (18), మంజమ్మ (30), ట్రాక్టర్ డ్రైవర్ కెంచప్ప (35), భరత్ (1) మాయ(16).
క్షతగాత్రులు వీరే..
మల్లారహళ్లికి చెందిన అజయ్, హనుమక్క, రేణుక , అంజలి, సవిత, మళ్లహళ్లికి చెందిన సండూరుకు చెందిన చేతన్, నాగరాజ, అరుణమ్మ కొప్పళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక కూడ్లిగి పట్టణంలోని 14వ వార్డుకు చెందిన రేఖ , అర్జున్, రక్షిత, మహాలక్ష్మి హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వంతెన పైనుంచి తుంగభద్ర నదిలోకి పడిన ట్రాక్టర్
ఘటనా స్థలంలో గుమికూడి ట్రాక్టర్‌ను పరిశీలిస్తున్న స్థానికులు
వివరాలు నమోదు చేస్తున్న పోలీసులు
ఘటనా స్థలిలో మృతుడు
గాయపడిన బాలుడు
ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
వంతెన పైనుంచి తుంగభద్ర
నదిలోకి పడిన ట్రాక్టర్
కొప్పళ జిల్లాలో ఘటన
మృతులంతా ఒకే కుటుంబం వారే
ఘటనలో పది మందికి పైగా
తీవ్ర గాయాలు
గాయపడిన వారిని హొసపేటె, కొప్పళలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ ఘోర దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఆరుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ట్రాక్టర్ కూడా నుజ్జునుజ్జయింది. ఘటన అనంతరం హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో భార్య, కుమారుడిని కోల్పోయిన మల్లేష్ తన మరో కుమారుడితో కలిసి రోదించిన తీరు చూపరులను కలిచి వేసింది. సమాచారం తెలియగానే బళ్లారి ఎంపీ తుకారాం హొసపేటెలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఘటనపై మునిరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


