బొమ్మనహళ్లి: కనకపుర పట్టణంలోని బెంగళూరు రోడ్డులో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు శుక్రవారం బాముల్ అధ్యక్షుడు డి.కె. సురేష్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆస్పత్రి నిర్మాణంతో కనకపుర తాలూకా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందన్నారు. రెండేళ్లలో భవన నిర్మాణాలు పూర్తవుతాయని, అయితే వచ్చే ఏడాది నుంచే వైద్య కళాశాల కార్యకలాపాలు ప్రారంభమై తాలూకా ప్రజలకు వైద్య సేవలు అందుతాయన్నారు. ఎమ్మెల్సీ ఎస్. రవి, బీడీసీసీ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు నారాయణ గౌడ, గ్యారంటీ ప్రాజెక్ట్ అమలు కమిటీ ఛైర్మన్ కె.ఎన్. దిలీప్ పాల్గొన్నారు.
17న మెట్రో సేవల్లో
అంతరాయం
యశవంతపుర: ఈనెల 17న ఆదివారం నమ్మ మెట్రో మెజిస్టిక్, విశ్వశ్వరయ్య స్టేషన్, సెంట్రల్ కాలేజీస్టేషన్‌లో మరమ్మతుల దృష్ట్యా రెండు గంటల పాటు మెట్రో సేవల్లో అంతరాయం ఉంటుందని బీఎంఆర్‌సీఎల్ అధికారులు తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల రాకపోకలను రద్దు చేశారు. చల్లఘట్ట–విజయనగర, ఎంజిరోడ్డు–వైట్‌ఫీల్డ్, మాదావర–సీల్కబోర్డు, ఆర్‌వీ రోడ్డు–బోమ్మనహళ్లిలో యథాస్థితిలో నడవనున్నాయి. 9 గంటల తరువాత రోజులాగానే మెట్రో సంచారం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఎలక్ట్రిక్ బైక్‌పై ప్రయాణించిన ఎమ్మెల్యే శ్రీవత్స
మైసూరు: మైసూరు నగరంలోని కేఆర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ఎస్. శ్రీవత్స తన విలాసవంతమైన పెట్రోల్ కారులో ప్రయాణించడం మానేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీవత్స తన రోజువారీ రవాణా వ్యవస్థలో ఇంధన వినియోగాన్ని 90 శాతం తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎలక్ట్రిక్ బైక్‌పై ప్రయాణించారు. ప్రజలు కూడా ప్రజా రవాణా బస్సులను ఎక్కువగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
ఆన్‌లైన్ గేమ్స్ కంపెనీకి
ఈడీ షాక్
బనశంకరి: ఆన్‌లైన్ గేమింగ్ సంస్ద గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈడీ బిగ్‌షాక్ ఇచ్చింది. ఇటీవల కంపెనీ కార్యాలయాలు, ప్రముఖ డైరెక్టర్ల నివాసాలపై నిర్వహించిన ఈడీ అధికారులు ఈ కేసులో సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను అధికారికంగా అరెస్ట్ చేసింది. సుమారు రూ.526 కోట్ల విలువ చేసే చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అక్రమ నగదు బదిలీ కేసులో గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ పృథ్వీరాజ్‌సింగ్, వికాస్ తనేజా, దీపక్‌సింగ్ అహ్లావత్ అనే ముగ్గురు డైరెక్టర్లను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ముగ్గురు డైరెక్టర్లు ఆర్థిక వ్యవహారాల్లో నేరుగా భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిని తీవ్రంగా విచారణ చేపడుతున్నారు. ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు ఈడీ అధికారుల బృందం బెంగళూరుతో పాటు వివిధ చోట్ల ఉన్న గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రముఖ కార్యాలయాలు, డైరెక్టర్లు, కంపెనీ ఉన్నతాధికారుల నివాసాలపై సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.
వారం రోజుల వ్యవధిలో కీలక ఫైళ్లు స్వాధీనం
వారం రోజుల వ్యవధిలో కంపెనీ వ్యవహారాలకు సంబంధించి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో ఈడీ అధికారులు భారీ ఎత్తున నగదు, ఆభరణాల ఆచూకీ కనిపెట్టారు. సుమారు రూ.3.5 కోట్ల విలువ చేసే 2.5 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రూ.11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు డిజిటల్ సాక్ష్యాలైన అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను జప్తు చేశారు. కేవలం నగదు, బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా కంపెనీలకు కోట్లాది రూపాయల ఆర్థిక పెట్టుబడులకు ఈడీ బ్రేక్ వేసింది. దర్యాప్తులో భాగంగా కంపెనీకి చెందిన వివిధ బ్యాంకు బ్యాలెన్స్ పేమెంట్ గేట్‌వే బ్యాలెన్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, స్థిర డిపాజిట్లు(ఎఫ్‌డీ)తో పాటు మొత్తం రూ.526.49 కోట్ల విలువైన చరాస్దులను ఈడీ ఫ్రీజ్ చేసింది.


