● విజయపురలో పిడుగుపాటుకు ఒకరు మృతి
● వర్ష బాధితులకు మంత్రి పాటిల్ పరామర్శ
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని పలు జిల్లాల్లో గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన జడివాన 8 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. విజయపుర జిల్లాలో రెండు గంటల పాటు కురిసిన వానకు ఎక్కడ చూసినా రోడ్లు బురదమయంగా మారాయి. విజయపుర జిల్లాలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆ జిల్లాలోని ఆలమేల తాలూకా మెరటిగిలో మట్టి మిద్దె కూలి గురునాథ్ బడిగేర(35), జ్యోతి(28), కాళమ్మ(13), కీర్తి(9) మట్టిలో కూరుకు పోవడంతో ఊపిరాడక మరణించారు. ఘటన స్థలానికి శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్, శాసన సభ్యులు అశోక్ మనగోళి, మాజీ శాసన సభ్యుడు రమేష్, జిల్లాధికారి ఆనంద్, ఎస్పీ లక్ష్మణ్ నింబరిగి, జెడ్పీ సీఈఓ రిషి ఆనంద్ చేరుకుని పరిశీలించారు. ఇక యాదగిరి జిల్లా శహాపుర, బీదర్ జిల్లా భాల్కి, తదితర ప్రాంతాల్లో కూడా భారీ వానలు పడ్డాయి. శహాపురలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వాన నీరు చేరాయి. సురపుర, నారాయణపుర, గురుమఠకల్, వడగేర, సైదాపుర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సేడం తాలూకాలో లక్ష్మణ్(40) అనే వ్యక్తి పిడుగుపాటుకు మృతి చెందారు. ముధోళలో గాలివానకు లక్ష్మీ వేంకటేశ్వర కల్యాణ మంటపం పైకప్పునకు వేసిన టిన్ షెడ్లు లేచిపోయాయి.


